సానుకూల మార్పునకు కుత్రిమ మేధ పెద్ద అవకాశం

సానుకూల మార్పునకు కుత్రిమ మేధ పెద్ద అవకాశం

సానుకూల మార్పునకు కుత్రిమ మేధ పెద్ద అవకాశమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు ఏఐ చేరేలా చూసుకోవడం అవసరమని ఆమె సూచించారు. గురువారం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్కిల్ ది నేషన్ ఏఐ ఛాలెంజ్ ను ఆమె ప్రారంభించారు. దీంతో పాటు ఓడిశాలోని రైరంగాపూర్ లో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్, స్కిల్ సెంటర్ ను వర్చ్యువల్ గా ఆమె ప్రారంభించారు. 

భారతదేశ భవిష్యత్తులో కుత్రిమ మేధ  కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ  “భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చోదకంగా కుత్రిమ మేధ అభివృద్ధి చెందుతోంది. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా వేగంగా పురోగమిస్తోంది” అని భరోసా వ్యక్తం చేశారు. 

“రాబోయే దశాబ్ద కాలంలో దేశ ఇడిపి, ఉపాధి, ఉత్పాదకతకు ఏఐ గణనీయంగా దోహదపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కుత్రిమ మేధ  వాడకాన్ని ప్రోత్సహిస్తూ సాంకేతిక నాయకత్వం కోసం పిల్లలను సిద్ధం చేస్తోంది. ఏఐ ల్యాబ్‌లు, ఏఐ నమూనాల ద్వారా పిల్లలలో వినూత్న ఆలోచనలు, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదపడుతుంది” అని ఆమె తెలిపారు.

అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా విద్యార్థులు తమను తాము సిద్ధం చేసుకోవడం పట్ల రాష్ట్రపతి ముర్ము ఆనందం వ్యక్తం చేశారు. తమ జ్ఞానం, నైపుణ్యాలను సమాజానికి సేవ చేసేందుకు, సవాళ్లను పరిష్కరించడానికి ఇతరులకు సాధికారత కల్పించడానికి ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా ఏఐ లెర్నింగ్ మాడ్యూల్‌లను పూర్తి చేసిన పార్లమెంటు సభ్యులను కూడా ఆమె అభినందించారు. 

పార్లమెంట్ సభ్యుల నిరంతర అభ్యాసం ద్వారా వారి నాయకత్వంలో ప్రతిబింబిస్తాయని రాష్ట్రపతి చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు కీలక సాధనంగా ఏఐని అభివర్ణిస్తూ రాబోయే దశాబ్దంలో జీడీపీ, ఉపాధి, ఉత్పాదకతను పెంచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. బలమైన జాతీయ ప్రతిభావంతులను తయారు చేయడంలో డేటా సైన్స్, ఏఐ ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్ వంటి నైపుణ్యాల ప్రాముఖ్యాన్నిఆమె  ప్రస్తావించారు.

సామాజిక, ఆర్థిక, సాంకేతిక అడ్డంకులను తగ్గించడానికి ఏఐని ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి సూచించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడమే కాకుండా బాధ్యతాయుతమైన, సమ్మిళిత సాంకేతిక భవిష్యత్తును రూపొందించేలా ప్రభుత్వంతో పాటు సంస్థలు, పరిశ్రమ భాగస్వాములు, విద్యాసంస్థలు కృషి చేస్తున్నాయని ఆమె తెలిపారు.

 జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా దేశాన్ని సూపర్ పవర్‌గా, వికసిత్ భారత్ను నిర్మించడానికి సమష్టిగా పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ప్రభుత్వం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేస్తోందని ఆమె చెప్పారు. దేశాన్ని ప్రపంచ ఏఐ లీడర్‌గా నిలబెట్టేందుకు ఇండియా ఏఐ మిషన్ అమలు చేస్తుందని ఆమె వివరించారు.