రష్యా న్యూఇయర్ వేడుకలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 24 మంది మృతి

రష్యా న్యూఇయర్ వేడుకలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 24 మంది మృతి
* శాంతి చర్చలు విఫలమైతే ఉక్రెయిన్ మొత్తం ఆక్రమిస్తాం.. పుతిన్

నూతన సంవత్సరం ప్రారంభంలో రష్యాలోని ఖేర్సన్ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ఓ కేఫ్పై, హోటల్పై ఉక్రెయిన్ మూడు డ్రోన్లతో దాడి చేసింది. అర్థరాత్రి సమయంలో చేసిన దాడిలో కనీసం 24 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.

“పౌరులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ప్రదేశంపై శత్రువులు డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు. నల్ల సముద్ర తీరంలోని ఖేర్సన్ ప్రాంతంలో ఉన్న ఒక కేఫ్, హోటల్పై ఉక్రెయిన్కు చెందిన మూడు యూఏవీ డ్రోన్లు దాడి చేశాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ దాడిలో కనీసం 24 మంది మరణించగా, 50 మందికి పైగా మరణించారు” అని ఖేర్సన్ గవర్నర్ వోలోడిమిర్ సాల్డో తెలిపారు.

“నూతన సంవత్సరం వేడుకల వేళ, రాత్రి సమయంలో ఉక్రెయిన్ డ్రోన్లతో లక్షిత దాడులకు పాల్పడింది. అయితే రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు ఏకంగా 168 ఉక్రెయిన్ యూఏవీలను అడ్డుకుని ధ్వంసం చేశాయి. ఒక్క బ్రయాన్స్క్ ప్రాంతంలోనే 61 డ్రోన్లను కూల్చేశాం. ఇక క్రాస్నోడార్లో 25, తుల ప్రాంతంలో 23, క్రిమియా రిపబ్లిక్లో 16, కలుగాలో 7, మాస్కో ప్రాంతంలో 12 డ్రోన్లను కూల్చేశాం” అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

“వీటిలో రాజధాని మాస్కో వైపు గురిపెట్టిన 9 యూఏవీలు కూడా ఉన్నాయి. ఇక అజోవ్ సముద్ర జలాలపై 24 ఉక్రెయిన్ డ్రోన్లను పేల్చేశాం. అయితే ఈ డ్రోన్ల దాడి వల్ల దక్షిణ, మధ్య రష్యాల్లోని అనేక విమానాశ్రయాలు గంటల తరబడి మూసివేయడం జరిగింది” అని రష్యా తెలిపింది.

మరోవైపు రష్యాతో యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి కేవలం 10 శాతం దూరంలో ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. అయితే కొన్ని అత్యంత ముఖ్యమైన అంశాలకు ఇంకా పరిష్కారాల్ని కనుగొనాల్సి ఉందని చెబుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యాకు ఉక్రెయిన్ భూభాగాల్ని వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ సహా ఐరోపా దేశాల భవితవ్యం శాంతి ఒప్పందంలోని కీలక అంశాలపైనే ఆధారపడి ఉందని జెలెన్స్కీ స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఒకవేళ ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు విఫలమైతే, ఆ దేశంలోని మిగతా భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని రష్యా ఆర్మీ భావిస్తోందని హెచ్చరించారు. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని దాదాపు 20 శాతం భూభాగాన్ని రష్యా సేనలు ఆక్రమించుకున్నాయి. ఉక్రెయిన్‌ తూర్పు భాగంలోని డాన్‌బాస్ ప్రాంతంపై పూర్తి పట్టు కోసం రష్యా సేనలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 మరోవంక, క్రాస్నోడార్‌, టాటర్‌స్తాన్‌ ప్రాంతాల్లోని చమురు స్థావరాలపై  ఉక్రెయిన్‌ దాడులకు దిగింది. దక్షిణ క్రాస్నోడార్‌ ప్రాంతంలోని ఇలస్కీ చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్‌ డ్రోన్‌లు దాడి చేశాయని రష్యా అధికారులు గురువారం తెలిపారు. టాటార్‌స్తాన్‌లోని అల్మెటీవ్స్క్‌ నగరంలో చమురు తయారీ కేంద్రాన్ని కూడా డ్రోన్‌లు తాకాయని పేర్కొన్నారు. డ్రోన్‌ దాడితో మంటలు చెలరేగాయని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.