పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో భారత్ – పాకిస్థాన్ వరుసగా 35వ ఏడాది తమ అణుశక్తి కేంద్రాల సమాచారాన్ని పంచుకున్నాయి. ఇరు దేశాలు ఒకదాన్నొకటి అణ్వాయుధాలతో దాడులు చేసుకోవడాన్ని నిషేధిస్తూ భారత్- పాకిస్థాన్ మధ్య 1988లో ఈ ఒప్పందం జరిగింది.
భారత్- పాకిస్థాన్ మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు క్షీణించినా తాజాగా ఇరు దేశాలు తమ వార్షిక అణ్వాయుధ సమాచారాన్ని దౌత్యమార్గాల ద్వారా ఏకకాలంలో ఇచ్చిపుచ్చుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలగా వస్తున్న ఒప్పందం ప్రకారం ఈ దేశాలు తమ అణ్వాయుధాల సమాచారాన్ని బదిలీ చేసుకున్నాయి.
అణు స్థావరాల విషయంలో 1988 డిసెంబర్ 31న భారత్, పాక్‌లు సంబంధిత ఒప్పందంపై సంతకం చేశాయి. 1992 జనవరి 1 నుంచి ఏటా అణు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా పవర్ ప్లాంట్స్, రీసెర్చ్ రియాక్టర్స్, ఫ్యూయల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్, ఎన్ రిచ్ మెంట్ ఫెసిలిటీస్, ఐసోటోప్ సెపరేషన్ ప్లాంట్స్, రీ ప్రాసెసింగ్ యూనిట్స్, స్టోరేజీ సైట్స్, రేడియోయాక్టివ్ మెటీరియల్స్ డీటెయిల్స్.. తదితర పూర్తి సమాచారాన్ని భారత్- పాకిస్థాన్ ఇచ్చిపుచ్చుకున్నాయి.
ఇదే క్రమంలో 2008 నాటి కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం కింద తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల వివరాలను సైతం రెండు దేశాలు పంచుకున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ వెల్లడించింది.
ఈ జాబితాల ప్రకారం పాకిస్థాన్ చెరలో భారతీయులు, భారతీయులుగా పరిగణిస్తున్నవారు 257 మంది ఉన్నారు. వారిలో 58 మంది పౌర ఖైదీలు కాగా మిగతా 199 మంది మత్స్యకారులు. భారత కస్టడీలో పాక్ జాతీయులు, పాక్ జాతీయులుగా పరిగణిస్తున్న వారు 424 మంది ఉన్నారు. అందులో 391 మంది పౌర ఖైదీలు కాగా 33 మంది జాలరులు ఉన్నారు.

More Stories
బంగ్లాదేశ్‌లో సజీవ దహనం నుండి తప్పించుకున్న మరో హిందూ
ఉగ్రవాదలతో పాకిస్థాన్ సంబంధాలు బట్టబయలు
రష్యా న్యూఇయర్ వేడుకలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 24 మంది మృతి