చైనాలో తైవాన్ పునరేకీకరణను ఎవరూ ఆపలేరంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పష్టం చేశారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనా ప్రజల మధ్య రక్తసంబంధం, బంధుత్వం ఉందని తెలిపారు. కొత్త ఏడాదిని పురస్కరించుకొని చైనా ప్రజలను ఉద్దేశించి టీవీలో చేసిన ప్రసంగంలో జిన్‌పింగ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 3 రోజులుగా తైవాన్ జలసంధిలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న వేళ, చైనాలో తైవాన్ విలీనం అనివార్యమని జిన్‌పింగ్ పేర్కొనటం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
తమ మాతృభూమి పునరేకీకరణ అనివార్యమని, దాన్ని ఆపడం ఎవరితరం కాదని జిన్‌పింగ్ తేల్చి చెప్పారు. మరోవైపు 2022 నుంచి తైవాన్ జలసంధిలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించటం ఇది ఆరోసారి. ఎయిర్‌ఫోర్స్ జెట్స్, ఎయిర్‌క్రాప్ట్ క్యారియర్స్, క్షిపణులు, డ్రోన్లతో పెద్దఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాల్లో బీజింగ్ సాధించిన పురోగతిని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కొత్త ఏడాది ప్రసంగంలో ప్రస్తావించారు.
బ్రహ్మపుత్ర నది దిగువ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణరీత్యా ఎంతో సున్నితమైన టిబెట్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని భారత్ సరిహద్దుకు సమీపంలో 170 బిలియన్ డాలర్లతో డ్రాగన్ ఈ డ్యాం నిర్మాణం ప్రారంభించింది. భారత్, బంగ్లాదేశ్‌లోని దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో చైనా ఎల్లప్పుడూ సరైనదిశలో నిలుస్తుందని చెప్పారు. ప్రపంచశాంతి, అభివృద్ధి, మానవాళి ఉమ్మడి భవిష్యత్తు కోసం అన్నిదేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని జిన్‌పింగ్ తెలిపారు. అగ్రరాజ్యం అమెరికాకు పరోక్ష సవాల్ విసిరేలా ‘జస్టిస్ మిషన్ 2025’ను చైనా నిర్వహిస్తోంది. పొరుగుదేశం తైవాన్ సరిహద్దుల చుట్టూ డిసెంబరు 29న చైనా మొదలుపెట్టిన సైనిక విన్యాసాలు బుధవారం కూడా కొనసాగాయి.
డిసెంబరు 31న ఉదయం 6 గంటలకు తమ దేశం సరిహద్దుల సమీపంలోకి చైనాకు చెందిన 77 యుద్ధ విమానాలు, 17 నౌకాదళ బోట్లు, 8 భారీ నౌకలు వచ్చాయని తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది. చైనాకు చెందిన 35 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్యస్థ రేఖను దాటేసి, తమ దేశపు ఉత్తర, మధ్య, నైరుతి ప్రాంతాల ‘గగనతల రక్షణ గుర్తింపు జోన్’ (ఏడీఐజెడ్)లోకి చొరబడ్డాయని వెల్లడించింది.

More Stories
జమాతే ఇస్లామీ అమీర్ డా. రెహమాన్ తో భారత దౌత్యవేత్త భేటీ!
దుబాయ్ లో ఉన్నానన్న హాదీ హత్య కేసులో నిందితుడు
భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించామంటున్న చైనా