భారత్- పాకిస్థాన్ ల మధ్య తాను జోక్యం చేసుకొని అణుయుద్ధం రాకుండా అడ్డుకున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇక్కపాటికే తరచూ చెబుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ట్రంప్ తరహాలోనే డ్రాగన్ దేశం చైనా కూడా అటువంటి వ్యాఖ్యలు చేసింది. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై భారత్ సైనిక చర్య చేపట్టింది. అయితే రెండు దేశాల డీజీఎంవోల చర్చల తర్వాతే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేసినట్లు భారత్ పేర్కొన్నది.
పాక్‌తో జరిగిన సమరంలో మూడవ దేశ పాత్ర లేదని భారత్ స్పష్టం చేసింది. అయితే, ఇండోపాక్ మధ్య శాంతి నెలకొల్పేందుకు తాము మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా ప్రకటించింది. చైనా వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్‌తో కాల్పుల విరమణలో మూడో పక్షం జోక్యం లేదని మరోసారి స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంక్షోభాలను పరిష్కరించేందుకు శాంతిదూత పాత్రను చైనా పోషించినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు.
ఇండోపాక్ యుద్ధమే కాదు మయన్మార్, కంబోడియా-థాయ్‌ల్యాండ్, ఇరాన్ న్యూక్లియర్ సమస్యను కూడా పరిష్కరించినట్లు చైనా మంత్రి చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో యుద్ధాలు, సీమాంతర దాడులు జరిగాయని, రాజకీయ అనిశ్చితి పెరిగిందని తెలిపారు. శాంతి స్థాపన చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నామని, దీని కోసం ఆ సమస్యల మూలాలను తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేశామని తెలిపారు.
బీజింగ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ అండ్ చైనా ఫారిన్ రిలేషన్స్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తాము మధ్యవర్తిత్వం వహించిన సమస్యాత్మక కేసుల్లో ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతలు కూడా ఉన్నట్లు మంత్రి వాంగ్ యి చెప్పారు. హాట్‌స్పాట్ ప్రాంతాల పట్ల చైనా తన విధానాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. నార్తర్న్ మయన్మార్ సమస్య పరిష్కారంలో, ఇరాన్ న్యూక్లియర్ సమస్య, ఇండో పాక్ ఉద్రిక్తతలు, పాలస్తీనా-ఇజ్రాయిల్ , కంబోడియా-థాయ్‌ల్యాండ్ సమస్య పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా మంత్రి తెలిపారు.
కానీ, భారత్-పాకిస్థాన్ ఘర్షణల పరిష్కారంలో చైనా ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. చైనా వాదన వింతగా ఉందని పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్ సీనియర్ సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల ఫలితంగానే మే 10న సైనిక చర్యలను నిలిపివేయడానికి ఒప్పందం కుదిరిందని వివరించారు.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్‌ల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేమీ లేదని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసింది. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, ఇందులో మధ్యవర్తి ఎవరూ లేరని అనేకసార్లు వెల్లడించింది. అయినా సరే ట్రంప్ క్రెడిట్ తీసుకోవడం ఆపడం లేదు.

More Stories
దుబాయ్ లో ఉన్నానన్న హాదీ హత్య కేసులో నిందితుడు
భారతీయ ఉగ్రవాదులతో ఖలీదా జియాకు వివాదాస్పద సంబంధాలు!
చిచ్చు రేపిన సల్మాన్ ఖాన్ చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’