బంగ్లా మాజీ ప్రధాని అంత్యక్రియలకు జైశంకర్

బంగ్లా మాజీ ప్రధాని అంత్యక్రియలకు జైశంకర్
* ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

 
రేపు ఢాకాలో జరుగనున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ భారత ప్రభుత్వ ప్రతినిధిగా హారాజై నివాళులు అర్పిస్తారు. రెండు దేశాల మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో ఈ పర్యటనకు దౌత్యపరమైన ప్రాధాన్యం ఏర్పడింది.  
“బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా అంత్యక్రియలకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ భారత ప్రభుత్వం, ప్రజల తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ మేరకు ఆయన డిసెంబర్ 31, 2025న ఢాకాను సందర్శిస్తారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సంక్షిప్త ప్రకటనలో తెలిపింది.
 
ప్రస్తుతం భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు పూర్తిగా సాఫీగా సాగడం లేదు. సరిహద్దు భద్రత, వాణిజ్యం, నీటి వనరుల పంపకం వంటి అంశాలపై రెండు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత విదేశాంగ మంత్రి ఢాకాకు వెళ్లడం, రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత స్థిరపర్చే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఖలీదా జియా అంత్యక్రియల్లో భారత ప్రతినిధి పాల్గొనడం మానవతా పరమైన గౌరవ సూచికగా మాత్రమే కాకుండా, రాజకీయ సందేశంగా కూడా భావిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా భారత్–బంగ్లాదేశ్ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకునే అవకాశాలు ఏర్పడతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు మరింత బలోపేతం అవుతాయా? ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం, చైనా ప్రభావం వంటి అంశాలపై పరస్పర అవగాహన పెరుగుతుందా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

మరోవంక, ఖలీదా జియా మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి, బంగ్లాదేశ్‌ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఖలీదా జియా లేనిలోటును ధైర్యంతో అధిగమించే శక్తిసామర్థ్యాలను ఆమె కుటుంబానికి ఇవ్వాలని ఎక్స్ వేదికగా ప్రధాని దేవున్ని ప్రార్థించారు.  బంగ్లా తొలి మహిళా ప్రధాని తన మాతృభూమి అభివృద్ధి కోసం, భారత్‌- బంగ్లా మధ్య సంబంధాల కోసం ఆమె చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2015లో ఖలీదా జియాను కలిసిన నాటి ఫొటోలను మోదీ ట్వీట్కు జత చేశారు.

“ఖలీదా జియా మృతి చెందారని తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఆమె కుటుంబానికి, బంగ్లాదేశ్ ప్రజలందరికీ మా ప్రగాఢ సానుభూతి. ఈ నష్టాన్ని భరించే శక్తిని దేవుడు ఆమె కుటుంబానికి ప్రసాదించాలని కోరుకుంటున్నా. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఆ దేశ అభివృద్ధికి, రెండు దేశాల సంబంధాల బలోపేతానికి ఆమె చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది” అని ఆయన ఎక్స్ లో తెలిపారు. 

“2015లో ఢాకాలో ఆమెతో జరిగిన ఆత్మీయ సమావేశం ఇప్పటికీ గుర్తుంది. ఆమె దూరదృష్టి, వారసత్వం రెండు దేశాల సంబంధాలకు భవిష్యత్తులో కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని ఆశిస్తున్నాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి” అని చెప్పారు.