ఉక్రెయిన్‌కు అమెరికా 15ఏళ్ల పాటు భద్రత హామీ

ఉక్రెయిన్‌కు అమెరికా 15ఏళ్ల పాటు భద్రత హామీ

* పుతిన్‌ నివాసంపై దాడికి ఉక్రెయిన్‌ యత్నం!

శాంతి ఒప్పంద ప్రణాళికలో భాగంగా అమెరికా, ఉక్రెయిన్‌కు 15ఏళ్ల పాటు భద్రత హామీని ప్రతిపాదించినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. అయితే రష్యా భూఆక్రమణను నిరోధించేందుకు ఉక్రెయిన్‌కు 50 ఏళ్ల పాటు అమెరికా భద్రత ఉంటే బాగుంటుందని తెలిపారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ముగించేందుకు కీలక అంశాలపై చర్చల్లో పురోగతిని అమెరికా వెతుకుతోంది. 

ఇందులో భాగంగా జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం సహా ఆక్రమించకున్న భూ భాగాల నుంచి సైన్యాలను రష్యా, ఉక్రెయిన్‌ ఉపసహరించుకోవాలి. అమెరికా నేతృత్వంలో నెలల తరబడి జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ శాంతి చర్చలు ఎన్నడూ లేని విధంగా సమీపానికి వచ్చాయని ట్రంప్​ అన్నారు. అయితే, ఈ చర్చలు విఫలమయ్యే అవకాశం కూడా ఉందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.

భద్రత హామీలు లేకుండా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగియదని జెలెన్‌స్కీ తెలిపారు. ఆదివారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​తో భేటీ అనంతరం జెలెన్​స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్​ కోసం 20 అంశాల శాంతి ప్రతిపాదన గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు తెలియజేశారని, దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ చర్చించారని పేర్కొన్నారు. 

యుద్ధం ముగింపునకు జెలెన్‌స్కీ కోరుతున్న భద్రత హామీలు ఇప్పటి వరకూ బహిర్గతం కాలేదు. కానీ, శాంతి ఒప్పందాన్ని పర్యవేక్షించడం, భాగస్వాములు కావడం వంటి అంశాలు అందులో ఉన్నాయని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. శాంతి ప్రణాళికపై ఉక్రెయిన్, అమెరికా, రష్యా, యూరప్ సంతకం చేయాలని ఆయన కోరారు.

ఇంకా దీనిని అమలు చేయడానికి సాంకేతిక బృందం అవసరం కావచ్చని అభిప్రాయపడ్డారు. రష్యాతో చర్చిచేందుకు అన్ని రకాల కమ్యూనికేషన్‌లను ఉక్రెయిన్ తెరిచి ఉందని చెప్పారు. ఉక్రెయిన్‌లో శాంతి ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరించాలని ప్రతిపాదించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణను సులభతరం చేసేందుకు కనీసం 60 రోజుల కాల్పుల విరమణ అవసరమని తెలిపారు. 

డాన్‌బాస్ ప్రాంతంలో స్వేచ్ఛా ఆర్థిక మండలాన్ని ఏర్పాటు చేయడంపై కూడా చర్చలు జరుగుతాయని చెప్పారు. మరోవైపు భద్రత హామీల పేరిట నాటో దేశాల దళాలను ఉక్రెయిన్‌లో మోహరించడాన్ని అంగీకరించబోమని రష్యా ఇప్పటికే స్పష్టం చేసింది. త్వరలో ట్రంప్‌, పుతిన్‌ మాట్లాడుకునే అవకాశాలున్నాయని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ వెల్లడించారు. కానీ, జెలెన్‌స్కీతో పుతిన్‌ మాట్లాడే అవకాశాలు లేవని చెప్పారు.

కాగా, రష్యాలో అధ్యక్షుడు పుతిన్‌ అధికార నివాసంపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులకు ప్రయత్నించిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్‌ తెలిపారు. నోవ్‌గోరోడ్‌ ప్రాంతంలో అధ్యక్షుడి నివాసాన్ని టార్గెట్‌ చేస్తూ ఓ రోజు రాత్రి ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి చేసినట్టు ఆయన ఆరోపించారు. అయితే వీటిని రష్యా విజయవంతంగా అడ్డుకుందని, గగనతల రక్షణ వ్యవస్థ 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను కూల్చేసిందని ఆయన పేర్కొన్నారు. 
 
కాగా, రష్యా ఆరోపణల్ని ఉక్రెయిన్‌ ఖండించింది. మరిన్ని సైనిక దాడులు చేపట్టేందుకు, శాంతి చర్చల్ని దెబ్బతీసేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నంగా ఉక్రెయిన్‌ ఆరోపించింది.