ఆరావళి పర్వతాల్లో గనుల తవ్వకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్వాగతించారు. ఆరావళి పర్వతాల పరిరక్షణ, పునరుద్ధరణకు కేంద్రం కట్టుబడి ఉందని వెల్లడించారు. ఈ సమస్యను అధ్యయనం చేసేందుకు కొత్త కమిటీని నియమించడాన్ని ఆయన స్వాగతించారు. అటు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ హర్షం వ్యక్తం చేశారు.
“గత కొన్ని రోజులుగా ఆరావళి పర్వతాలపై రాజకీయాలు చేస్తున్నారంటూ నన్ను, మూడు సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా చేసిన అశోక్ గహ్లోత్ను కేంద్ర పర్యావరణ మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఈరోజు సుప్రీం కోర్టు క్లారిటీ ఇచ్చింది. ఆరావళి పర్వతాలపై ఇచ్చిన నిర్వచనంపై సుప్రీం కోర్టు స్టే విధించింది” అని తెలిపారు.
దేశంలోనే అతిపురాతన పర్వతశ్రేణి ఆరావళి. ఇక్కడ అక్రమంగా పొందిన అనుమతులతో అడ్డగోలుగా మైనింగ్ జరుగుతోందని ఎప్పటినుంచో ఆందోళన ఉంది. ఇలాంటి సమయంలో 100 మీటర్లు అంటే 328 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్నవి మాత్రమే పర్వతాలంటూ కేంద్రం కొత్త నిర్వచనం చెప్పింది. దీనిని సుప్రీం కోర్టు సైతం ఆమోదించింది. దీంతో 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్‌కు అనుమతించింది కేంద్రం.
అయితే, దీనివల్ల హరియాణా, రాజస్థాన్, గుజరాత్, డిల్లీకి ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఆరావళి పర్వత శ్రేణులు ఉన్న రాష్ట్రాలు కొత్తగా మైనింగ్ లీజులేవీ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది.

More Stories
దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ ‘పినాక’ తొలి ప్రయోగం విజయవంతం
డిల్లీని కమ్మేసిన పొగమంచు- విమానాలు రద్దు, రైళ్లు ఆలస్యం
ఆరావళి గనుల తవ్వకంలో గత తీర్పుపై సుప్రీం స్టే