ఆరావళి గనుల తవ్వకంలో గత తీర్పుపై సుప్రీం స్టే

ఆరావళి గనుల తవ్వకంలో గత తీర్పుపై సుప్రీం స్టే
ఆరావళి పర్వతాల నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలు, నిపుణుల కమిటీ నివేదిక అమలుపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. ఏదైనా నివేదిక లేదా కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి ముందు న్యాయమైన, నిష్పాక్షికమైన, స్వతంత్ర నిపుణుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ ఎ.జి.మసిహ్‌లతో  కూడిన ధర్మాసనం పేర్కొంది. 
 
100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ భూభాగాలకు ఆరావళిని పరిమితం చేయడం క్రమబద్ధీకరించలేని మైనింగ్‌కు దారితీస్తుందా అనే అంశాన్ని పున:సమీక్షిస్తామని, వివరణలు కోరతామని ధర్మాసనం తెలిపింది.   ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం ధర్మాసనం గత నెల ఇచ్చిన తన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జె.కె. మహేశ్వరి, ఎ.జి. మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
 
ఆరావళి పర్వతాల పరిధి నిర్వచనాన్ని పరిశీలించేందుకు ఉన్నత స్థాయి నిపుణులతో కమిటీని నియమించాలని ప్రతిపాదిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. కమిటీ నియామకంపై కోర్టుకు సహకరించాలని అటార్నీ జనరల్‌ , సీనియర్‌ న్యాయవాది పి.పరమేశ్వర్‌ అభ్యర్థించడంతో పిటిషన్‌దారులకు నోటీసులు జారీ చేసింది. 
 
కొత్త కమిటీని నియమించే వరకు కమిటీ సిఫారసులు, గతంలో ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు, ఈ అంశంపై సుమోటోగా దాఖలైన కేసుపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి, ఆరావళి రాష్ట్రాలైన రాజస్థాన్‌, గుజరాత్‌, ఢిల్లీ, హర్యానాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 21కి వాయిదా వేసింది.ఈ ఏడాది అక్టోబర్‌ 13న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ ఆరావళి పర్వతాలకు కొత్తగా 100 మీటర్ల నిర్వచనాన్ని సుప్రీంకోర్టు వద్ద ప్రతిపాదించిన విషయం తెలిసిందే. మంత్రిత్వశాఖ అందచేసిన 100 మీటర్ల నిబంధన సిఫార్సును సుప్రీంకోర్టు నవంబర్‌ 20న ఆమోదించింది.

అయితే, సుప్రీం తీర్పుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆరావళిపై తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ న్యాయవాది, పర్యావరణ కార్యకర్త జితేంద్ర గాంధీ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి సోమవారం లేఖ రాశారు. ఎత్తు ప్రాతిపదికన పర్వతాన్ని నిర్ణయించడం వల్ల అనాలోచితంగా అది వాయువ్య భారతదేశం వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణను బలహీనపరుస్తుందని రాష్ట్రపతికి కూడా పంపిన తన లేఖలో జితేంద్ర పేర్కొన్నారు. 

సుప్రీం తీర్పుతో ఆరావళి పర్వత శ్రేణుల్లో 90 శాతం పర్వతాలు రక్షణను కోల్పోతాయని, మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగి పర్యావరణ విధ్వంసం జరుగుతుందని, థార్‌ ఎడారి ఢిల్లీ వరకు విస్తరించి భూగర్భ జలాల రీచార్జ్‌ నిలిచిపోవడంతోపాటు జీవ వైవిధ్యం దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.