భారత్ కు ఎదురవుతున్న అతిపెద్ద ప్రమాదం వాయు కాలుష్యమే

భారత్ కు ఎదురవుతున్న అతిపెద్ద ప్రమాదం వాయు కాలుష్యమే

x

కరోనా అనంతరం భారత్ కు ఎదురవుతున్న అతిపెద్ద ప్రమాదం వాయు కాలుష్యమేననీ, దీన్ని నివారించడానికి సత్వరం కార్యాచరణ చేపట్టకపోతే పరిస్థితి ఏటేటా దిగజారిపోతుందని పరిశోధకులు హెచ్చరించారు. వాయు కాలుష్యం వల్ల కంటికి కనిపించకుండా శ్వాసకోశ వ్యాధులు ఏకమవుతున్నాయని, ఏదో ఒకరోజు అవన్నీ నిశబ్ధ సునామీలా విరుచుకుపడతాయని వెల్లడించారు. 

బ్రిటన్‌లోని భారత సంతతి శ్వాసకోశ వ్యాధి నిపుణులు మనీశ్‌ గౌతమ్, రజయ్‌ నారాయణ్‌లతో పాటు బ్రిటిష్‌ మిడ్ల్యాండ్‌ మెట్రోపాలిటన్‌ విశ్వవిద్యాలయ ఆస్పత్రి ఆచార్యుడు డెరెక్‌ కానల్లీ ఈ పరిశోధనలో పాల్గొన్నారు.

“విమానాలు, ముఖ్యంగా మోటారు వాహనాలు వెదజల్లే కర్బన ఉద్గారాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా హృదయ, రక్తనాళాల వ్యాధులకు దారితీస్తున్నాయి. స్థూలకాయం కన్నా వాయు కాలుష్యమే ఈ వ్యాధులకు మూలకారణం. వాహనాల పొగలకు తోడు పంట వ్యర్థాల దహనం వల్ల ఏర్పడుతున్న వాయు కాలుష్యంతో ఉత్తర భారతంలో కోట్లమంది ప్రభావితం అవుతున్నారు” అని భారత సంతతి శ్వాసకోశ వ్యాధి నిపుణులు మనీశ్‌ గౌతమ్ తెలిపారు.

“నేడు ప్రపంచంలో అత్యంత తీవ్రంగా వాయు కాలుష్యం బారిన పడిన నగరంగా ఢిల్లీ రికార్డులకెక్కింది. ఈ డిసెంబరులో ఢిల్లీ ఆస్పత్రుల్లో చేరిన శ్వాసకోశ రోగుల సంఖ్య 20 నుంచి 30 శాతం పెరిగింది. వీరిలో యువజనులు, మొదటిసారి శ్వాసకోశ వ్యాధుల బారినపడినవారు కూడా ఉన్నారు. వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ రోగాలతోపాటు హృదయ, రక్తనాళ వ్యాధులు, నాడీ సంబంధ వ్యాధులు కూడా వస్తాయి”  అని భారత సంతతి హుద్రోగ నిపుణులు రజయ్ నారాయణ్ హెచ్చరించారు.

మరోవైపు వాయుకాలుష్యం శారీరక ఆరోగ్యాన్నే కాదని, మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఐక్యూ పడిపోవడంతో పాటు అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ) వచ్చే ప్రమాదమూ పెరుగుతుందని వివరించారు. మానసిక ఆరోగ్యానికి, వాయు కాలుష్యానికి మధ్య ఉన్న సంబంధంపై జరుగుతున్న వివిధ పరిశోధనల గురించి పలువురు సైకాలజిస్ట్‌లు, సైకియాట్రిస్ట్‌లు వెల్లడించారు.

ఆ వివరాల ప్రకారం వాయు కాలుష్యం ప్రభావానికి ఎక్కువగా లోనైతే ఒత్తిడి, కంగారు, జ్ఞాపకశక్తి క్షీణత మొదలైన సమస్యలు తలెత్తుతాయని బహిర్గతమైంది. కొన్నిసార్లు అల్జీమర్స్, పార్కిన్సన్స్‌ బారినా పడొచ్చని తేలింది. అంతగా కాలుష్యం లేని నగరాలతో పోలిస్తే కాలుష్యంతో సతమతమవుతున్న దిల్లీలో ఒత్తిడి, ఆందోళనతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య 40 శాతం ఎక్కువగా ఉందని సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ అంజల్‌ మిగ్లానీ వివరించారు. 

వాయు కాలుష్యాన్ని మెంటల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించి, ఆ కోణంలో విధివిధానాలను రూపొందించాలని ప్రభుత్వాలకు ఎయిమ్స్‌లో సైకాలజిస్ట్‌ డా.దీపికా దహిమా, పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ జితేందర్‌ నాగ్‌పాల్ సూచించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, ఢిల్లీలో గత మూడేళ్లలో రెండు లక్షలకు పైగా శ్వాస సంబంధిత కేసులు నమోదయ్యాయి. 

లాన్సెట్ నివేదిక ప్రకారం 2022లో భారత్లో కాలుష్యం కారణంగా 17లక్షల మరణాలు జరిగాయని పేర్కొంది. వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటే లక్షలాది మంది ప్రాణాలను కాపాడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ అధ్యయనం ప్రకారం రోడ్డు రవాణా ఫలితంగా విడుదలయ్యే కర్భన ఉద్గారాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటే సుమారు 20 లక్షల ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొంది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి 14లక్షల చిన్నారుల్లో ఆస్తమా బారిన పడకుండా అడ్డుకోవచ్చని తెలిపింది.