సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు వెంకటరమణా రెడ్డి, రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, మల్క కొమురయ్య, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు, మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా, సమావేశంలో వ్యక్తిగత కారణాలతో పాల్గొనలేని ఎమ్మెల్యేలతో కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఫోన్ ద్వారా సంప్రదించి, పార్టీ ఉద్దేశాలను వివరించారు. ప్రతి ఎమ్మెల్యేకు సమావేశంలో చర్చించిన అంశాలపై అవగాహన కల్పించి, శాసనసభలో సమన్వయంతో పాల్గొనేలా దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో రానున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ప్రజాపక్షంగా బలంగా నిలబడి, ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి స్పష్టమైన సమాధానాలు రాబట్టే విధంగా పార్టీ తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. సభలో సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజలకు సంబంధించిన కీలక అంశాలను సమర్థంగా, ప్రభావవంతంగా లేవనెత్తాలన్న దిశగా సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై అసెంబ్లీలో బలమైన స్వరం వినిపించి ప్రజాపక్షంగా రాష్ట్ర ప్రజల జీవన సమస్యలను శాసనసభలో కేంద్రబిందువుగా చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు బహిర్గతం చేయడం, ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం అసెంబ్లీలో బీజేపీ బలమైన పాత్ర పోషించాలన్న సంకల్పాన్ని ఈ సమావేశంలో పార్టీ నాయకత్వం వ్యక్తం చేసింది.
More Stories
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చార్జిషీట్
ఈగల్ బృందంలో కొందరు డ్రగ్స్ పెడ్లర్లతో రాజీ
హిందూ కార్యకర్తలు ఏదేశంలోనైనా ధర్మానికి అనువుగా జీవించాలి