తెలంగాణలో ఇటీవల ఓ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్‌పై ఏసీబీ దాడిచేస్తే వందల కోట్ల ఆస్తులు వెలుగు చూశాయి. అంతకు ముందు రెవిన్యూ సహా ఇతర విభాగాల్లో ఉద్యోగుల అవినీతిపై సోదాలు జరిపినా వందల కోట్ల ఆస్తులే దొరుకుతున్నాయి. వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న సంగతి పక్కన పెడితే వీరే ఇలా సంపాదిస్తే ఇక ఐఏఎస్, ఐపీఎస్ ల సంపాదన ఎలా ఉంటుందన్నది ఊహకు అందని విషయం.
కానీ వారి చేతుల్లోనే అధికారం ఉంటుంది. వారిపై ఎవరు సోదాలు జరుపుతారు?. కానీ కేంద్రం ఇప్పుడు కొత్తగా వారి ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఒత్తిడి చేస్తోంది. కానీ చాలా మంది స్పందించడంలేదు. కేంద్ర సిబ్బంది ,శిక్షణ శాఖ దేశంలోని ఐఏఎస్ అధికారులందరికీ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2024 సంవత్సరానికి సంబంధించిన స్థిరాస్తి రిటర్నులను వచ్చే ఏడాది జనవరి 31 లోపు సమర్పించాలని స్పష్టం చేసింది.
అధికారుల ఆస్తుల వివరాల్లో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఈ ప్రక్రియను చేపడుతుంది. అయితే ప్రతి ఏడాది చాలామంది అధికారులు ఏ ఈనిబంధనలను పట్టించుకోవడం లేదు. దానితో నిర్ణీత గడువులోపు ఆస్తుల వివరాలు ఇవ్వని పక్షంలో, సదరు అధికారులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఈ ఏడాది కేంద్రం హెచ్చరించింది.
నిబంధనల ప్రకారం గడువు లోపు ఆస్తుల వివరాలు సమర్పించని అధికారులకు ప్రమోషన్లు, విదేశీ పోస్టింగ్‌ల విషయంలో అడ్డంకులు ఎదురవుతాయి. అంతేకాకుండా, వారికి ప్రభుత్వం నుంచి అందే విజిలెన్స్ క్లియరెన్స్ నిలిపివేస్తారు. ఆస్తుల వివరాలు దాచడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం క్రమశిక్షణా ఉల్లంఘన.
ఒక అధికారి సర్వీసులో చేరినప్పుడు ఉన్న ఆస్తులకు, సర్వీసులో ఉండగా సమకూరిన ఆస్తులకు మధ్య వ్యత్యాసాన్ని దీని ద్వారా పర్యవేక్షించవచ్చు. ఇది అవినీతిని అరికట్టడానికి ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. ఆస్తుల వివరాలను ఆన్లైన్ పోర్టల్ స్పారో ద్వారా బహిరంగ పరచడం వల్ల సామాన్యులకు కూడా సమాచార హక్కు చట్టం కింద లేదా నేరుగా అధికారుల ఆస్తులను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఇది అధికారుల ప్రవర్తనను పరోక్షంగా నియంత్రిస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో దర్యాప్తు సంస్థలకు ఈ డేటా కీలకమైన ఆధారంగా మారుతుంది. పారదర్శకమైన పాలన అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ చర్య ఒక పునాది వంటిదని కేంద్రం చెబితోంది. ప్రస్తుతం కేంద్రం జారీ చేసిన ఈ ఆదేశాలు కేవలం ఐఏఎస్ అధికారులకే పరిమితం కాకుండా, ఐపీఎస్ , ఐఎఫ్ఎస్ అధికారులకు కూడా వర్తిస్తాయి.
ఈ ఏడాది ఆస్తుల వెల్లడి ప్రక్రియను మరింత కఠినతరం చేయడం ద్వారా, ఉన్నతాధికారుల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తనను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. డిజిటల్ విధానంలో ఈ వివరాల సేకరణ జరుగుతుండటంతో, డేటా విశ్లేషణ కూడా సులభం కానుంది. చాలా మంది అధికారులు తమ పేరుతో, తమ కుటుంబ సభ్యుల పేర్లతో విచ్చలవిడిగా ఆస్తులు పోగేసుకున్నారు.
అందుకే వివరాలివ్వడానికి చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ఎంతో మందికి బినామీ పేర్లతో ఆస్తులున్నాయి. ప్రతి ఒక్కరిపైనా సమగ్ర పరిశీలన జరిపితే ఓ రాష్ట్ర బడ్జెట్ అంత అక్రమాస్తులు వెలుగు చూస్తాయని ఎక్కువ మంది నమ్మకం. కానీ అలా ఏ ప్రభుత్వమూ చేయలేదు.

More Stories
యుపిలో పార్టీ నేతల కులాలవారీ భేటీలపై బిజెపి ఆగ్రహం
ఛత్తీస్‌గఢ్‌లో హింసాత్మకంగా బొగ్గు గనుల ప్రాజెక్ట్ నిరసనలు
సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లను వెనక్కి నెట్టిన జయశ్రీ ఉల్లాల్