దుర్గగుడికి విద్యుత్ సరఫరా మూడు గంటలు నిలిపివేత

దుర్గగుడికి విద్యుత్ సరఫరా మూడు గంటలు నిలిపివేత

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రికి విద్యుత్ సరఫరా శనివారం మూడు గంటలకు పైగా నిలిపివేశారు. విద్యుత్ శాఖ అధికారులతో దేవస్థానం సంప్రదింపులు జరిపి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరడంతో మూడు గంటల అనంతరం విజయవాడ దుర్గ గుడికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.  దేవస్థానం నుంచి రూ. 3.08 కోట్ల మేరకు బకాయిలు రావాల్సి ఉందని, 2023 ఫిబ్రవరి నుంచి ఒక్క నయాపైసా కూడా బకాయి చెల్లించకుండా విద్యుత్తు వాడుకుంటోందన్నది ఏపీసీపీడీసీఎల్ ఆరోపిస్తోంది.

అనేకసార్లు నోటీసులు జారీ చేసినా దుర్గగుడి అధికారుల్లో స్పందన లేదని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు.  దుర్గగుడి అధికారులు మాత్రం తాము సోలార్‌ విద్యుత్తును ఉత్పత్తి చేసి అందిస్తున్నామని, నెట్‌మీటరింగ్‌ కోరుతూ అనేకసార్లు లేఖలు రాసినా, నేరుగా మాట్లాడినా ఏపీసీపీడీసీఎల్ అధికారుల నుంచి చర్యలు లేవంటున్నారు. ఈ వ్యవహారం దేవస్థానం, విద్యుత్తుశాఖ మధ్య వివాదాస్పదంగా మారింది. 

ఇటీవల అమ్మవారి ఆలయానికి ఏపీసీపీడీసీఎల్ ఉన్నతాధికారులు వచ్చిన సమయంలోనూ దేవస్థానం ఈవో, పాలకమండలి మధ్య చర్చ జరిగింది. పాతపాడులోని ఐదు ఎకరాల్లో కోట్ల రూపాయలను వెచ్చించి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం సౌరవిద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌ వినియోగంలోకి తేవడానికే తీవ్ర జాప్యం జరిగింది.  ఎట్టకేలకు సోలార్‌ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అవుతోన్న విద్యుత్తును నున్నకు సమీపంలోని గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.

దేవస్థానానికి సర్కిల్‌ 01 పరిధిలో ఒక హెచ్టీ, 10 ఎల్టీ  సర్వీసులున్నాయి. ఈ సర్వీసుల ద్వారా విద్యుత్తు వినియోగించుకుంటున్నారు. ఒక మెగావాట్‌ సౌర విద్యుత్తు ప్లాంట్‌ను పాతపాడులో ఏర్పాటు చేశారు.  ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అయిన విద్యుత్తును 12 నెలలపాటు గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఆ తర్వాత సాంకేతిక కారణాలతో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును పంపిణీ సంస్థ నమోదు చేయలేదు. ఇప్పుడు తమకు బిల్లు బకాయిలు ఉన్నాయనీ, చెల్లించాలంటూ తాఖీదులిచ్చారు. దుర్గగుడి, విద్యుత్తుశాఖ మధ్య వివాదం అంశం ఈనాడు-ఈటీవీ-భారత్ వెలుగులోకి తీసుకొచ్చింది.