గత రెండేళ్లలోనే సుమారు 5,000 మంది వైద్యులు, 11,000 మంది ఇంజనీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు దేశం విడిచి వెళ్ళిపోవడం అక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. కేవలం వీరే కాకుండా ఐటీ నిపుణులు, మేనేజర్లు కూడా భారీ సంఖ్యలో గల్ఫ్ దేశాలు, ఐరోపా, అమెరికా బాట పడుతున్నారు. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడం, రూపాయి విలువ పతనం కావడం, నిరుద్యోగం పెరగడమే ఈ భారీ వలసలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. దేశం నుండి నిపుణులు వెళ్ళిపోవడాన్ని ఆయన ‘బ్రెయిన్ డ్రెయిన్’ కాదని, వారు విదేశాల్లో సంపాదించి దేశానికి విదేశీ మార్పిడి పంపుతారు కాబట్టి అది ‘బ్రెయిన్ గెయిన్’ అని పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ప్రతిభావంతులు కరువై వ్యవస్థలు కుప్పకూలుతుంటే, ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. దేశాభివృద్ధికి ఉపయోగపడాల్సిన మేధావులు పరాయి దేశాలకు సేవ చేయడం ‘గెయిన్’ ఎలా అవుతుందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. పాకిస్థాన్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభానికి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, రాజకీయ అస్థిరత, అవినీతియే మూలకారణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక దేశానికి వెన్నెముక లాంటి డాక్టర్లు, ఇంజనీర్లు వెళ్లిపోతే ఆరోగ్య, మౌలిక సదుపాయాల రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. యువతలో ఉన్న అసంతృప్తిని గమనించి వారికి స్వదేశంలోనే అవకాశాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారు. మేధావుల వలస ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో పాకిస్థాన్ కేవలం వృద్ధులతో, నైపుణ్యం లేని కార్మికులతో నిండిపోయి ఆర్థికంగా మరింత దిగజారే ప్రమాదం ఉంది.

More Stories
తప్పుడు మత దూషణ ఆరోపణలతో బంగ్లా హిందువులపై దాడులు
కెనడాలో భారత మహిళలకు భరోసాగా ఓ కేంద్రం!
తైవాన్ కు అమెరికా ఆయుధాల అమ్మకంపై చైనా హెచ్చరిక