అస్సాంలో ముస్లిం జనాభా 40 శాతం చేరుకుంటుందని ఆందోళన

అస్సాంలో ముస్లిం జనాభా 40 శాతం చేరుకుంటుందని ఆందోళన
అస్సాంలో జనాభా మార్పులపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. 2027లో జనాభా లెక్కల నివేదిక వెలువడే నాటికి ఈ ఈశాన్య రాష్ట్రంలో బంగ్లాదేశ్ మూలాలున్న ముస్లిం జనాభా సుమారు 40 శాతానికి చేరుకుంటుందని ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అస్సాం యూనిట్ కోర్ కమిటీ సమావేశంలో శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
బంగ్లాదేశ్‌కు ‘బలమైన సందేశం’ పంపడానికి అస్సాంలో చొరబాటుదారుల తొలగింపు కొనసాగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చొరబాటుదారులకు మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు. బంగ్లాదేశీ ముస్లింల జనాభా 50 శాతానికి మించితే వారు ‘రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకుంటారనే’ విషయం ఆ పాత పార్టీకి తెలియదని ఆయన ధ్వజమెత్తారు.
 
“2011 జనాభా లెక్కల ప్రకారం, అస్సాంలో 34 శాతం ముస్లిం జనాభా ఉంది,” అని శర్మ పేర్కొన్నారు. “మనం మూడు శాతం అస్సామీ ముస్లింలను మినహాయిస్తే, అస్సాంలో బంగ్లాదేశ్ మూలాలున్న ముస్లిం జనాభా 31 శాతంగా ఉంది. 2021లో జనాభా లెక్కలు నిర్వహించలేదు. 2027లో జనాభా లెక్కల నివేదిక వచ్చినప్పుడు, బంగ్లాదేశ్ మూలాలున్న ముస్లిం జనాభా సుమారు 40 శాతానికి చేరుకుంటుంది” అని తెలిపారు.

అసోంలో బంగ్లాదేశ్ మూలాలున్న ముస్లిం జనాభా పెరగడం అనేది ఇది కేవలం రాజకీయ సమస్య కాదని, నాగరికతకు సంబంధించిన సమస్య అని హిమంత స్పష్టం చేశారు. “మన సమాజాన్ని బలహీనపరిచేందుకు జరుగుతున్న కుట్ర ఇది. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన బుజ్జగింపు విధానాల వల్ల దాదాపు 1.5 కోట్ల మందితో కూడిన ఒక ‘కొత్త నాగరికత’ క్రమంగా తయారైంది. ఇది అసోం సామాజిక, సాంస్కృతిక అస్థిత్వానికే ముప్పుగా పరిణమిస్తోంది. ఈ పరిణామాలు రాష్ట్ర భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.
 
అసోం సాంస్కృతిక వారసత్వంపైనా సీఎం హిమంత స్పష్టమైన వైఖరిని వెల్లడించారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ఆయన తప్పుబట్టారు. “అసోంలో కేవలం శంకర్ దేవ్, మాధవ్ దేవ్ (ప్రముఖ వైష్ణవ గురువులు) వారసత్వం మాత్రమే ఉంది. ఇక్కడ ‘శంకర్-అజాన్’ (హిందూ-ముస్లిం మిశ్రమ సంస్కృతి) అనే భావన లేదు” అని తేల్చి చెప్పారు. చరిత్రలో అజాన్ ఫకీర్ ఉన్నప్పటికీ, ఆయన సేవలను ఆ కోణంలోనే చూడాలని సూచించారు. దాన్ని అసోం ప్రధాన సంస్కృతితో ముడిపెట్టకూడదని పరోక్షంగా స్పష్టం చేశారు.
 
మొఘలులను ఓడించిన గొప్ప యోధుడు లచిత్ బోర్ఫుకాన్ గురించి కూడా సీఎం ప్రస్తావించారు. “లచిత్ బోర్ఫుకాన్ వారసత్వానికి సంబంధం లేని వ్యక్తులను ఆపాదించి మన పోరాటాన్ని బలహీనపరచకూడదు. మొఘలులను తరిమికొట్టిన ఏకైక వీరుడిగా లచిత్‌ను మనం చూడాలి” అని పిలుపునిచ్చారు. చరిత్రను వక్రీకరించి, అనవసరమైన పాత్రలను ఇరికించే ప్రయత్నాలను ఆయన ఖండించారు.
 
కాగా, డిసెంబర్ 23న చబూవాలో విలేకరులతో మాట్లాడుతూ, బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (బీఎన్‌సీపీ) నాయకుడు హస్నత్ అబ్దుల్లా వ్యాఖ్యలపై శర్మ స్పందించారు.
“అస్సాంలో, జనాభాలో 40 శాతం మంది బంగ్లాదేశ్ మూలాలున్నవారే. ఇది మరో 10 శాతం పెరిగితే, మనం దానంతట అదే అందులో కలిసిపోతాము… అందుకే నేను గత ఐదేళ్లుగా (ఈ విషయం గురించి) గొంతు చించుకుంటున్నాను,” అని ఆయన చెప్పారు. భారతదేశ ఈశాన్య ప్రాంతాన్ని వేరుచేయడంపై పలువురు బంగ్లాదేశ్ నాయకులు వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.