హెచ్1బీ వీసా ఇంటర్వ్యూల ఆకస్మిక రద్దుపై భారత్ ఆందోళన

హెచ్1బీ వీసా ఇంటర్వ్యూల ఆకస్మిక రద్దుపై భారత్ ఆందోళన

ముందస్తుగా షెడ్యూల్ చేసిన భారతీయుల హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను అమెరికా అకస్మాత్తుగా రద్దు చేయడంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అమెరికాకు తెలియజేసినట్లు వెల్లడించింది. ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల పెద్దసంఖ్యలో భారతీయ దరఖాస్తులుదారులు అసౌకర్యానికి గురవుతున్నారనే విషయాన్ని అమెరికాకు తెలియజేశామని పేర్కొంది. 

ప్రస్తుతం ఈ అంశంపై భారత్, అమెరికా విదేశాంగ శాఖలు సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపింది. వేలాది మంది భారతీయ దరఖాస్తుదారులకు డిసెంబరు 15 నుంచి నిర్వహించాల్సిన హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఇటీవలే కొన్ని నెలల పాటు వాయిదావేసింది. ఆయా దరఖాస్తుదారుల సోషల్ మీడియా పోస్టులను తనిఖీ చేసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఈనేపథ్యంలో డిసెంబరు చివరివారంలో హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిన చాలా మంది భారతీయులకు అమెరికా ఇమిగ్రేషన్ విభాగం నుంచి షాకింగ్ ఈమెయిల్స్ వచ్చాయి. ఇంటర్వ్యూ తేదీని వచ్చే సంవత్సరం (2026) మే నెలకు మార్చామని వాటిలో ఉండటాన్ని చూసి దరఖాస్తుదారులు విస్మయానికి గురయ్యారు. ఈనేపథ్యంలో తాజాగా భారత విదేశాంగ శాఖ చేసిన ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

“‘హెచ్1బీ వీసా ఇంటర్వ్యూల ఆకస్మిక రద్దుతో అసౌకర్యానికి గురయ్యాం’ అంటూ చాలామంది భారతీయులు మాకు లేఖలు రాశారు. వీసా ఇంటర్వ్యూ తేదీలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం అకస్మాత్తుగా మార్చినందు వల్ల ఇబ్బందిపడుతున్నట్లు మాకు తెలిపారు” అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.  “వీసా సంబంధిత అంశాలు అనేవి ఆయా దేశాల సార్వభౌమ అధికారం పరిధిలోకి వస్తాయి. అయినప్పటికీ మేం భారతీయ వీసా దరఖాస్తుదారులకు ఎదురవుతున్న అసౌకర్యం గురించి న్యూడిల్లీతో పాటు వాషింగ్టన్ డీసీలో ఉన్న అమెరికా ఇమిగ్రేషన్ విభాగాలకు సమాచారాన్ని ఇచ్చాం” అని ఆయన చెప్పారు.

“వీసా ఇంటర్వ్యూల రద్దు వల్ల కొందరు భారతీయులు ఎక్కువ కాలం పాటు భారత్‌లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వారి కుటుంబాలు అసౌకర్యానికి గురవుతున్నాయి. భారతీయుల అసౌకర్యాన్ని వీలైనంత మేరకు తగ్గించే దిశగా అమెరికాతో మా సంప్రదింపులు కొనసాగుతున్నాయి” అని జైస్వాల్ వివరించారు.