భారత్ లో నోటి క్యాన్సర్ కేసుల్లో సుమారు 62 శాతం మద్యపానం, పొగాకు (గుట్కా, ఖైనీ, పాన్ వంటి పొగాకు పదార్థాలు) వినియోగం వల్లనే జరుగుతున్నాయని ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనాన్ని మహారాష్ట్రలోని సెంటర్ ఫర్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ, హెూమీ భాభా నేషనల్ ఇన్స్టిట్యూట్ పరిశోధక బృందం నిర్వహించింది. ఈ పరిశోదన ప్రకారం రోజుకు రెండు గ్రాముల కంటే తక్కువ మోతాదులో బీరు తీసుకున్నా కూడా బక్కల్ మ్యూకోసా క్యాన్సర్ (బిఎంసి) ముప్పు పెరుగుతుంది.
రోజుకు తొమ్మిది గ్రాముల మద్యం (సుమారు ఒక స్టాండర్డ్ డ్రింక్ కు సమానం) సేవిస్తే నోటి 2 నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమారు 50 శాతం వరకు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా నోటి క్యాన్సర్ కేసుల్లో 62 శాతం వరకు మద్యపానానికి పొగాకు తోడవటం వల్లనే జరుగుతున్నది. దేశవ్యాప్తంగా బక్కల్ మ్యూకోసా క్యాన్సర్ కేసుల్లో 11.5 శాతం మద్యానికి సంబంధించినవిగా గుర్తించారు. అంటే పది కేసుల్లో ఒకటికి పైగా ఇవే అన్నమాట.
అయితే మేఘాలయ, అసోం, మధ్యప్రదేశ్, వంటి రాష్ట్రాలో ఇది 14 శాతం వరకు ఉండటం గమనార్హం. ఇక మద్యం వినియోగం అధికంగా ఉన్న రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ (26 శాతం) నిలవగా, గుజరాత్ (4 శాతం)లో మద్యం వినియోగం చాలా తక్కువగా ఉన్నది. 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల కొత్త నోటి క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. భారత్ లో ఇది రెండో అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రతి ఏడాది సుమారు 1,43,759 కేసులు, 79,979 మరణాలు నమోదవుతున్నాయి.
భారత్ లో నోటి క్యాన్సర్ ప్రధాన రూపం బీఎంసీ. ఇక్కడ దీని మనుగడ రేటు తక్కువగానే ఉన్నప్పటికీ.. ఐదేళ్ల నికర మనుగడ రేటు 43 శాతంగా ఉన్నది. ఈ పరిశోధనలో పాల్గొన్నవారు ఎక్కువ మంది 35-54 ఏండ్ల వయసువారే. అయితే నోటి క్యాన్సర్ కేసుల్లో దాదాపు 46 శాతం మంది 25-45 ఏండ్ల వయసున్న యువత ఉండడం ఆందోళన కలిగించే అంశంగా పరిశోధకులు పేర్కొన్నారు. మద్యం సేవించనివారితో పోలిస్తే, మద్యం సేవించేవారిలో నోటి క్యాన్సర్ ప్రమాదం 68 శాతం ఎక్కువగా ఉన్నది.
అంతర్జాతీయ బ్రాండ్ల మద్యం తీసుకునేవారిలో ఇది 72 శాతం, స్థానికంగా తయారయ్యే మద్యం సేవించేవారిలో 87 శాతం వరకు ప్రమాదం పెరుగుతుందని అధ్యయనం హెచ్చరించింది. తాజా అధ్యయనం మద్యం, పొగాకు వల్ల కలిగే అనర్దాలను నొక్కి చెప్తున్నదని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా దేశ యువత వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనీ, లేకపోతే క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంటుందని హెచ్చరిస్తున్నారు. మద్యం తక్కువ మోతాదు అయినా నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందనీ, దానికి పొగాకు కూడా తోడైతే బీఎంసీ కేసులు తీవ్రమవుతాయన్న విషయాన్ని వైద్య నిపుణులు హైలెట్ చేస్తున్నారు.

More Stories
అమెరికాలో ప్రతిభకు మతం పరిమితిగా మారుతుందా?
ఎర్రకోట పేలుడులో 40 కిలోల పేలుడు పదార్థాలు
బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని ఖండించిన భారత్