బాల పుర‌స్కారం అందుకున్న క్రికెట‌ర్ వైభ‌వ్

బాల పుర‌స్కారం అందుకున్న క్రికెట‌ర్ వైభ‌వ్

ప్ర‌ధాన‌మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కారాన్ని యువ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ  అందుకున్నారు. రాష్ట్ర‌ప‌తి ముర్ము చేతుల మీదుగా 14 ఏళ్ల ఆ క్రికెట‌ర్ అవార్డును స్వీక‌రించారు. ఢిల్లీలో శుక్రవారం ఆ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ధైర్య‌సాహ‌సాలు, క‌ళ‌లు, సంస్కృతి, ప‌ర్యావ‌ర‌ణం, ఇన్నోవేష‌న్‌, సైన్స్ అండ్ టెక్నాల‌జీ, క్రీడ‌ల్లో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన‌ వారికి బాల పుర‌స్కారాన్ని ప్ర‌తి ఏడాది అంద‌జేస్తారు. 

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఈ అవార్డు స్వీక‌రించే క్ర‌మంలో క్రికెట‌ర్ వైభ‌వ్ ఇవాళ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. వాస్త‌వానికి బీహార్‌, మ‌ణిపూర్ మ‌ధ్య ఇవాళ విజ‌య్ హజారే ట్రోఫీ మ్యాచ్ జ‌రుగుతున్న‌ది. కానీ ఆ మ్యాచ్‌లో వైభ‌వ్ ఆడడం లేదు5 నుంచి 18 ఏళ్లు ఉన్న‌వారికి బాల్ పుర‌స్కారాలు అంద‌జేస్తారు. వైభ‌వ్‌తో పాటు మొత్తం 19 మంది పిల్ల‌ల‌కు వివిధ రంగాల్లో అవార్డుల‌ను అంద‌జేశారు. 

సూర్యవంశీ ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో ఐపీఎల్​లో అతి పిన్న వయసులో (14 ఏళ్ల 23 రోజులు) అరంగేట్రం చేసిన క్రికెటర్​గా ఘనత సాధించాడు. అలాగే ఈ టోర్నీలో తాను ఆడిన మూడో మ్యాచ్​లోనే సూపర్ సెంచరీ సాధించాడు. గుజరాత్ టైటాన్స్​ జట్టుపై 35 బంతుల్లోనే సెంచరీ అందుకొని ఐపీఎల్ హిస్టరీలో అతి తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాటర్​గానూ రికార్డ్ కొట్టాడు.

ఈ తర్వాత తన ఫామ్​ కొనసాగిస్తూ వైభవ్ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌, అండర్‌ -19 ఆసియా కప్‌, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీల్లోనూ సెంచరీలు నమోదు చేశాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్​ ప్రదేశ్​ జట్టుపై తుఫాన్ ఇన్నింగ్స్​తో చెలరేగాడు. 84 బంతుల్లో 190 పరుగులు ఔరా అనిపించాడు. ఇందులో 16 ఫోర్లు, 15 సిక్స్‌లు ఉండడం విశేషం. అలా ఏప్రిల్ నుంచి ఈ ఏడాది వైభవ్ ఆడిన ప్రతీ టోర్నీలో తన మార్క్ చూపించాడు.

మీరు సాధించిన ఘ‌న‌త యావ‌త్ దేశానికి ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని, ఇవాళ గుర్తింపు పొందిన ప్ర‌తి చిన్నారి చాలా ముఖ్య‌మైన , విలువైన వ్య‌క్తులు అని, అలాంటి నైపుణ్యం ఉన్న పిల్ల‌ల వ‌ల్లే ప్ర‌పంచ‌వ్యాప్తంగా దేశానికి గుర్తింపు వ‌స్తున్న‌ద‌ని రాష్ట్ర‌ప‌తి ముర్ము తెలిపారు.