దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫైయర్స్పై జీఎస్టీ తగ్గింపు అంశంపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జీఎస్టీ తగ్గింపు అంశంపై వివరణాత్మక స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి 10 రోజుల సమయం ఇచ్చింది.
ఢిల్లీలోని గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్నందువల్ల ఎయిర్ ప్యూరిఫైయర్లను మెడికల్ డివైసెస్గా వర్గీకరించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో అడ్వకేట్ కపిల్ మదన్ ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలు చేశారు. దీనిపై రెండు రోజుల క్రితం విచారణ జరిపిన న్యాయస్థానం దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫయర్స్పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని ఎందుకు తాత్కాలికంగా మినహాయించలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఇక ఈ అంశంపై ఢిల్లీ కోర్టు ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జీఎస్టీ తగ్గింపుపై నిర్ణయం తీసుకునేందుకు జీఎస్టీ మండలికి ఇబ్బందేమిటని ప్రశ్నించింది. అయితే, ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపు కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను కేంద్రం వ్యతిరేకించింది. అది ఆమోదయోగ్యం కాదని వాదించింది.
వైద్య పరికరాల వర్గీకరణను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందని, ఈ విషయంపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. జీఎస్టీ కౌన్సిల్ ఒక రాజ్యాంగ సంస్థ అని, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇందులో పాల్గొంటున్నందున జీఎస్టీ తగ్గింపు ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయలేమని కేంద్రం తరపున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకట్రామన్ పేర్కొన్నారు.
ఈ విషయంపై వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. దీంతో కోర్టు 10 రోజుల సమయం ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది.

More Stories
ఆరావళి పర్వతాల్లో మైనింగ్ నిషేధం
కేరళలో 24, ఛత్తీస్గఢ్లో 27, ఎంపీలో 42 లక్షల ఓట్ల తొలగింపు
భారత్ లో చిక్కుకుపోయిన హెచ్-1బి వీసా దారులు