కెనడాలో టొరంటో విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతీయ విద్యార్థి శివాంక్ అవస్థీపై కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పాయాడు. హిమాన్షి ఖురానా అనే మరో భారతీయ విద్యార్థిని హత్య జరిగిన కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం అక్కడి ప్రవాస భారతీయులను, విద్యార్థి లోకాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం శివాంక్ హత్య జరిగిందని, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
“హైల్యాండ్ క్రీక్ ట్రెయిల్ వద్ద టొరంటో విశ్వవిద్యాలయంలో చదువుతున్న శివాంక్ అవస్థిపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. అయితే, అప్పటికే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. నిందితులు కూడా అక్కడి నుంచి పరారయ్యారు” అని పోలీసులు తెలిపారు. శివాంక్ స్కార్‌బొరౌగ్ యూనివర్సిటీలో లైఫ్ సైన్సెస్ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. స్థానిక హైల్యాండ్ క్రీక్ టెయిల్ వద్ద డిసెంబర్ 23వ తేదీన ఓ దుండగుడు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శివాంక్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కాల్పుల విషయం తెలుసుకుని తాము అక్కడికి వెళ్లేసరికి దుండగుడు పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. శివాంక్ హత్య నేపథ్యంలో యూనివర్సిటీ కాలేజీ క్యాంపస్‌ను కాసేపు మూసివేశారు. ఈ ఘటనపై టొరంటోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
“టొరంటో స్కార్‌బొరౌగ్ విశ్వవిద్యాలయం సమీపంలో జరిగిన కాల్పుల్లో యువ భారతీయ విద్యార్థి శివాంక్ అవస్థి (20) ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. ఈ క్లిష్ట సమయంలో బాధితుడి కుటుంబానికి అండగా ఉంటాం. స్థానిక అధికారుల సమన్వయంతో వారికి అవసరమైన సాయం అందిస్తాం” అని పేర్కొంది. ఇది ఈ సంవత్సరం టొరంటోలో 41వ హత్య అని పోలీసులు తెలిపారు. ఇటీవల కెనడాలో భారతీయ మహిళ హిమాన్షీ ఖురానా హత్యకు గురైన ఘటనపై కూడా పోలీసులు మాట్లాడారు.
భారత సంతతికి చెందిన 30 ఏళ్ల హిమాన్షీ ఖురానా ఈ నెల 19న హత్యకు గురైందని, బాధితురాలికి తెలిసిన అనుమానితుడిపై కెనడా వ్యాప్తంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని పోలీసులు తెలిపారు. మృతురాలిని టొరంటో నివాసి హిమాన్షీ ఖురానాగా గుర్తించామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి టొరంటోకు చెందిన అబ్దుల్ గఫూరీ (32) కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు .

More Stories
డెన్మార్క్‌తోనే కొనసాగుతాం.. గ్రీన్లాండ్ ప్రధాని స్పష్టం
లండన్ లో 14 ఏళ్ల సిక్కు బాలికపై పాక్ గ్యాంగ్ అత్యాచారం
ఇరాన్లో భారతీయులు వెంటనే ఆ దేశాన్ని విడిచి రావాలి