అరుణాచల్ పై కన్ను.. అమెరికా నివేదికపై భగ్గుమన్న చైనా!

అరుణాచల్ పై కన్ను.. అమెరికా నివేదికపై భగ్గుమన్న చైనా!

అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనాకు ఎప్పటికీ రాజీపడే ఉద్దేశం లేదని, ఈ ప్రాంతంపై డ్రాగన్ కన్ను పడిందని అంటూ అమెరికా పెంటగాన్ విడుదల చేసిన తాజా నివేదికపై చైనా ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నది.  చైనా తన ‘కోర్ ఇంట్రెస్ట్’ (కీలక ప్రయోజనాల) జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ ను చేర్చిందని, చేర్చడం. సాధారణంగా తైవాన్, టిబెట్ వంటి అత్యంత సున్నితమైన అంశాలను మాత్రమే చైనా ఈ జాబితాలో ఉంచుతోందని ఈ నివేదిక తెలిపింది.

 ఇప్పుడు అరుణాచల్‌ను కూడా అందులోకి చేర్చడం ద్వారా, ఆ ప్రాంతంపై తమ పట్టును బిగించేందుకు చైనా ప్రయత్నిస్తోందని అంటూ పెంటగాన్ నివేదిక వెల్లడించింది. పైగా, 2049 నాటికి తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడమే చైనా తుదులక్ష్యమని ఆ నివేదిక పేర్కొంది. పెంటగాన్ నివేదిక ప్రకారం, తైవాన్‌, సెంకాకు ద్వీపాలు, అలాగే భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌ వంటి ప్రాంతాలు చైనా జాతీయ పునరుజ్జీవ వ్యూహంలో భాగంగా ఉన్నాయి. 

ఈ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా చైనా మూడు ప్రధాన లక్ష్యాలను సాధించాలని చూస్తోందని తెలిపింది.  అవి— చైనా కమ్యూనిస్టు పార్టీపై పూర్తి నియంత్రణ కొనసాగించడం, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం, అలాగే సార్వభౌమాధికారం, ప్రాదేశిక దావాలను బలపరచడం. అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ తన పాలనకు దేశంలోపల, బయట నుంచి వచ్చే విమర్శలను తీవ్రమైన ముప్పుగా భావిస్తోందని నివేదిక పేర్కొంది. 

పార్టీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నేతలు, ఉద్యమాలను విదేశీ శక్తుల మద్దతుతో పనిచేసే వేర్పాటువాదులుగా చిత్రీకరిస్తోందని తెలిపింది. ఇక భారత్–చైనా మధ్య ఎల్ ఏ సి  వెంబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కూడా పెంటగాన్ కీలక విషయాలు వెల్లడించింది. దక్షిణ ఆసియాలో భౌగోళిక రాజకీయ సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉన్న ఈ అంశాన్ని అమెరికా బహిర్గతం చేయడంతో చైనా మండిపడుతుంది.

భారత్-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాల్లో మూడో దేశం ప్రమేయం ఉండకూడదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా ఉద్దేశపూర్వకంగానే భారత్ మరియు చైనాల మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.  ముఖ్యంగా వాస్తవాధీన రేఖ వెంట జరుగుతున్న పరిణామాలపై పెంటగాన్ చేసిన వ్యాఖ్యలు చైనాకు ఆగ్రహం కలిగించాయి. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించుకోవడానికి తగిన సామర్థ్యం తమకు ఉందని, ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకుని పరిస్థితిని మరింత క్లిష్టతరం చేయవద్దని చైనా హెచ్చరించింది.

గత ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీ, ఇరుదేశాల సంబంధాలను పునరుద్ధరించడానికి మార్గం చూపిందని పేర్కొంది. ఈ తగ్గిన ఉద్రిక్తతలను ఉపయోగించుకుని భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చాలని చైనా యోచిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో భారత్–అమెరికా సంబంధాలు మరింత బలపడకుండా అడ్డుకోవడంపై చైనా అప్రమత్తంగా వ్యవహరిస్తోందని కూడా పెంటగాన్ నివేదిక స్పష్టం చేసింది.

భారత్‌తో సంబంధాలను తాత్కాలికంగా మెరుగుపరుచుకోవడం ద్వారా, భారత్-అమెరికా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక మైత్రిని అడ్డుకోవాలని చైనా కుట్ర పన్నుతోందని పెంటగాన్ ఆరోపించింది. అంటే, సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించడం వెనుక చైనాకు నిజాయితీ లేదని, కేవలం భారత్ అమెరికాకు దగ్గరవ్వకుండా చూడటమే వారి అసలు ఉద్దేశమని అమెరికా విశ్లేషించింది. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలు చైనా యొక్క విస్తరణవాద ధోరణిని, దౌత్యపరమైన వ్యూహాలను ఎండగట్టాయి.