నైజీరియాలో ఐఎస్ఐఎస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు

నైజీరియాలో ఐఎస్ఐఎస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు

నైజీరియాలో బీభత్సం సృష్టిస్తున్న ఐసీస్ స్థావరాలపై అమెరికా దళాలు భారీ వైమానిక దాడి చేశాయి. వాయువ్య నైజీరియాలో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న దాడులకు ప్రతికారంగానే ఈ ‘డెడ్లీ స్ట్రైక్’ నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. తాను గతంలోనే హెచ్చరించానని, క్రైస్తవుల ఊచకోత ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని. చెప్పినట్లు గుర్తు చేశారు. 

ఈ రాత్రి ఆ ఉగ్రవాద మూకలకు నరకం చూపించామని, తన ఆదేశాలతోనే అమెరికా సైన్యం అత్యంత సమర్థవంతంగా, కచ్చితత్వంతో ఈ దాడులను నిర్వహించిందని, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఈ దాడిలో చనిపోయిన ఉగ్రవాదలకు ట్రంప్ తనదైన శైలిలో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.

“కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా నా ఆదేశాల మేరకు ఈ రాత్రి వాయవ్య నైజీరియాలో ఐసిస్‌ ఉగ్రవాదులపై అమెరికా దాడి చేసింది. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని క్రూరంగా హత్యలు చేస్తున్న ఈ ఉగ్రవాదులపై ఈ దాడి జరిగింది. క్రైస్తవుల ఊచకోతను ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు తప్పవని నేను ఇప్పటికే హెచ్చరించాను. ఈ రాత్రి ఆ హెచ్చరికను అమలు చేశాం” అని వెల్లడించారు.

అలాగే, ఉగ్రవాదులు తమ ఊచకోతను ఆపకుంటే మరిన్ని దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. “రక్షణ శాఖ కచ్చితమైన దాడులను విజయవంతంగా నిర్వహించింది. నా నాయకత్వంతో తీవ్రవాద ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని ఎదగనివ్వను. అమెరికా సైన్యాన్ని దేవుడు ఆశీర్వదించాలి. అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు. మృతి చెందిన ఉగ్రవాదులకు కూడా. క్రైస్తవులపై హింస కొనసాగితే ఇలాంటి మరెన్నో దాడులు తప్పవు” అని ట్రంప్ హెచ్చరించారు.

నైజీరియాలో ఐసీస్-వెస్ట్ ఆఫ్రికా అనే ఉగ్రవాద సంస్థ గత కొంతకాలంగా ప్రమాదకరంగా మారింది. ప్రధానంగా క్రైస్తవ గ్రామాలను లక్ష్యంగా చేసుకోవడం, చర్చిలపై దాడులు చేయడం, మతపరమైన ఊచకోతకు పాల్పడటం వంటి చర్యలకు ఈ సంస్థ ఒడిగట్టింది.  గత కొన్నేళ్లుగా చూడని స్థాయిలో ఉగ్రవాదులు అమాయక పౌరులను బలి తీసుకోవడంపై అమెరికా ఐసీస్-వెస్ట్ సంస్థను టార్గెట్ చేసింది. కేవలం నైజీరియాలోనే కాకుండా, గత కొన్ని రోజులుగా అమెరికా దళాలు ప్రపంచవ్యాప్తంగా ఐసీస్ స్థావరాలను నిర్వీర్యం చేస్తున్నాయి.

అయితే తమ దేశంలోని భద్రతా సమస్యలు మతపరమైన కోణానికి మాత్రమే పరిమితం కావని నైజీరియా ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లింలు, క్రైస్తువులు రెండు మతాల వారిపైనా దాడులు జరుగుతున్నాయని తెలిపింది. క్రైస్తవులపై మాత్రమే దాడులు జరుగుతున్నాయన్న ట్రంప్ వ్యాఖ్యలు తమ దేశంలోని పరిస్థితులకు సరిపోవని తెలిపింది. అయినప్పటికీ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.