ఆటగాళ్ల ఎంపికలో బంధుప్రీతి 2014 లోనే అంతమైంది

ఆటగాళ్ల ఎంపికలో బంధుప్రీతి 2014 లోనే అంతమైంది
ఆటగాళ్ల ఎంపికలో బంధుప్రీతి 2014 లోనే అంతమైందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇప్పుడు కష్టపడేతత్వం, నైపుణ్యం ఉన్న పేద పిల్లలు కూడా ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని తెలిపారు. యువతలో క్రీడా సంస్కృతి, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఢిల్లీలో నిర్వహించిన ‘సంసద్‌ ఖేల్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ  మాట్లాడారు. 
 
దీనిని ఓ ప్రజా ఉద్యమంగా అభివర్ణిస్తూ, ఈ కార్యక్రమం ద్వారా వేలాది ప్రతిభావంతులైన క్రీడాకారులను దేశం గుర్తిస్తున్నదని ప్రధాని చెప్పారు. 2014 కు ముందు క్రీడాకారుల ఎంపికలో అవినీతి, అక్రమాలు ఉండేవని, ఆ విధానానికి ముగింపు పలికి దశాబ్దమైందని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మెరుగయ్యాయని తెలిపారు. ప్రస్తుతం పేద కుటుంబాల పిల్లలు కూడా ప్రతిభ, కష్టపడే తత్వంతో క్రీడల్లో రాణిస్తూ ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని చెప్పారు

2014 కు ముందు క్రీడల కోసం దేశ బడ్జెట్‌లో రూ.1200 కోట్లు కేటాయిస్తే, ఆ తర్వాతి కాలంలో రూ.3 వేల కోట్ల కంటే ఎక్కువ కేటాయిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రత్యేక పథకాల ద్వారా అర్హులైన అథ్లెట్లకు నెలకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు.

“ఈ రోజు, సంసద్ ఖేల్ మహోత్సవ్ ఒక ప్రజా ఉద్యమంగా మారింది… నగరాల నుండి గ్రామాల వరకు, అన్ని వర్గాల యువత ఇందులో పాలుపంచుకుంటున్నారు. ఇది దీని స్థాయి ఎంత గొప్పదో చూపిస్తుంది. కాశీ పార్లమెంట్ సభ్యుడిగా, నా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈ క్రీడా కార్యక్రమంతో నేను దగ్గరగా అనుబంధం కలిగి ఉన్నాను… దీని ద్వారా యువత కొత్త మైలురాళ్లను నెలకొల్పడం చూసి నేను సంతోషిస్తున్నాను” అని ప్రధాని తెలిపారు. 
 
ఈ సంవత్సరం కూడా, అనేక వారాల పాటు జరిగిన ఈ బృహత్తర కార్యక్రమం యువతకు ఒక బలమైన వేదికగా నిలిచిందని చెబుతూ దీని ద్వారా దివ్యాంగులైన క్రీడాకారులు కూడా ముందుకు సాగే అవకాశాన్ని పొందారని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా దేశంలోని క్రీడాకారులందరికీ, యువతకు  హృదయపూర్వక అభినందనలు తెలిపారు. క్రీడా అవకాశాలు పరిమితం కాదని, అపరిమితమని ప్రధాని నొక్కి చెప్పారు, దేశంలో ఇప్పుడు ఒక బలమైన క్రీడా పర్యావరణ వ్యవస్థ సృష్టించిన్నట్లు స్పష్టం చేశారు.