కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంస్) ప్రథమ స్థానానికి చేరుకుందని, బీఎంఎస్ కార్యకర్తలు దేశ హితం, ఉద్యోగుల హితం, శ్రామికుల హితం కోసమే పనిచేస్తున్నారని, వారి మనసంతా వీటిపైనే లగ్నమై వుంటుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే కొనియాడారు. విశ్వకర్మ సేవా సమితి, భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంత నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో గురువారం ముఖ్యఅతిధిగా పాల్గొంటూ బిఎంఎస్ శ్రమ జీవుల, కార్మికుల సంఘటన అని చెప్పారు.
దేశ ఆర్థిక రథ చక్రాలను ముందుకు తీసుకెళ్లే వ్యక్తులే శ్రమజీవులు, కర్షకులు అని తెలిపారు. బీఎంఎస్ కార్యకర్తలు మొదట సంఘటనా కార్యం గురించి, శ్రామికుల గురించి ఆలోచించిన తర్వాతే, తమ వ్యక్తిగతం గురించి తర్వాత ఆలోచిస్తారని ప్రశంసించారు. ఇదేమీ బీఎంఎస్ నినాదం కాదని, ఇదో జీవన శైలి అని, ఇది బీఎంస్ దృష్టికోణమని ఆయన వివరించారు. త్యాగం, తపస్సు, బలిదానమే బీఎంఎస్ కి చిహ్నమని, దీనిని స్థాపన నుంచే చెబుతూ వస్తున్నామని హోసబళే గుర్తు చేశారు.
అయితే ఇదేమీ శబ్దాల ఉచ్చారణ కాదని, దీని వెనుక మహా కార్యం నడుస్తోందని, దీని కోసం చాలా మంది సర్వస్వాన్నీ అర్పణ చేసినవారున్నారని తెలిపారు. అలాగే అహోరాత్రాలు సంఘటన కోసం, బీఎంఎస్ కోసం తపస్సు చేశారని, అంతకంటే ఓ అడుగు ముందుకు వేసి, అవసరం అనుకుంటే బలిదానం కూడా అయ్యారని ఆయన చెప్పారు. బలిదానం కోసం ఎన్నడూ వెనకడగే వేయలేదని చెబుతూ ఈ గుణాలన్నింటికీ సంబంధించిన ఉదాహరణలు కోకొల్లలుగా బీఎంఎస్ లో వున్నాయని ఆయన తెలిపారు.
వీటన్నింటి గుణగణాల వల్లే 70 సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా బీఎంఎస్ బృహత్ సంఘటనా శక్తిగా నిలబడిందని, అత్యంత పెద్ద శక్తిగా రూపాంతరం చెందిందని తెలిపారు. అయితే ఇదంతా కూడా కేవలం కార్యాలయ భవనం వల్లే కాలేదని, త్యాగం, తపస్సు, దృష్టికోణం, పరిశ్రమ వల్ల, దేశం కోసం పనిచేయాలన్న దృష్టి కోణంతోనే ఇంత పెద్ద పని జరిగిందని స్పష్టం చేశారు.
ఇలాంటి సైద్ధాంతిక భూమిక వల్ల, పరిశ్రమ వల్లే బీఎంఎస్ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా నిలబడిందని, ఈ కారణాల వల్లే అందరూ బీఎంఎస్ చెప్పినట్లు వింటున్నారని తెలిపారు. శ్రామికుల సంఘటన, వారి ఆర్థిక పరిస్థితుల్లో అభ్యున్నతి, దేశహితం, పర్యావరణ సంరక్షణ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, భారతీయ మూలాల ఆధారంగా బీఎంఎస్ సమాజం ముందు వుంచిందని, దీని కోసమే సంఘటనను నిర్మించిందని దత్తాత్రేయ గుర్తు చేశారు.
అలాగే కార్యకర్తలకు ప్రశిక్షణను కూడా ఇచ్చిందని, వీటి ఆధారంగా ఉద్యమాలు కూడా చేసిందని, అలాగే ఈ సైద్ధాంతిక భూమికపై కలిసొచ్చే వారితో ఓ జాబితా కూడా రూపొందించిందని, ఈ కారణాల వల్ల కూడా ప్రపంచంలో బీఎంఎస్ గురించి కార్మికులు, శ్రామికులు, సాధారణ ప్రజలు వినడానికి ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారని ఆయన వివరించారు. అలాగే బీఎంఎస్ ఉద్యమ రూపాన్ని అధ్యయనం చేయడానికి ముందుకు కూడా వస్తున్నారని తెలిపారు.
బీఎంఎస్ వ్యవస్థాపకులు దత్తోపంథ్ ఠెంగ్డే చైనాలో పర్యటించి, అక్కడ రేడియోలో ప్రసంగించారని, అక్కడి కరుడుగట్టిన కమ్యూనిస్టులు కూడా మంత్ర ముగ్ధులయ్యారని, బీఎంఎస్ ఇంత పటిష్ఠంగా, వేగంగా ఎలా సంఘటనాత్మక రూపం తీసుకుందో చెప్పాలంటూ ఆశ్చర్యపడిపోయారని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రపంచ వేదికలపై బీఎంఎస్ సైద్ధాంతికతను, ఆలోచనలను చెబుతున్నారని తెలిపారు.
శ్రామికుల వికాసం, దేశ వికాసం, ఈ ప్రపంచంతో సమతౌల్యం, సమన్వయం, అలాగే ప్రపంచంలోని వివిధ రంగాలను సమన్వయం చేయడం, సామరస్వపూర్వకంగా ఓ శ్రామిక కుటుంబాన్ని నిర్మించడం అనే కల్పన అత్యంత విశిష్టమైందని, ఇతరుకుల ఇది అసాధ్యమైందని, అలాంటి సైద్ధాంతిక భూమికను బీఎంఎస్ ప్రపంచానికి అందించిందని ఆయన చెప్పారు.
వీటన్నింటి నేపథ్యంతో బీఎంఎస్ వైపు ఆకర్షితులు అవుతున్నారని, కలిసి వస్తున్నారని అన్నారు. అలాగే బీఎంఎస్ ఎదిగిన విధానం మన దేశంలోని వ్యక్తులకు కూడా చాలా ఆశ్చర్యచకితులు అయిన వారూ వున్నారన్నారు. అలాగే బీఎంఎస్ ను ఠేంగ్డేజీ, వారి నుంచి స్ఫూర్తి పొందిన వారు, కార్యకర్తలు బీఎంఎస్ ధ్యేయాన్ని ప్రజల ముందు వుంచారని తెలిపారు.
బీఎంఎస్ వ్యాపకత్వం ఏదైతే వుందో అది కేవలం ఇటుకలు, మట్టి, రాళ్లు, సిమెంటు భవనాల ద్వారా జరగలేదని, కార్యకర్తల మనస్సు, కుశాగ్ర బుద్ధి కారణంగా, మనుష్యుల ప్రయత్నం వల్ల, సైద్ధాంతికత వల్ల, సమాజంలో బీఎంఎస్ సంఘటనను ప్రేమించే వారి వల్ల జరిగిందని వివరించారు. ప్రేమ, త్యాగం, బలిదానం, సైద్ధాంతికతే బీఎంఎస్ పునాదులు అని అభివర్ణించారు. వీటి ఆధారంగా మజ్దూర్ సంఘ్ సంఘటన నిలబడిందన్నారు.
భారత ప్రభుత్వం తాజాగా కార్మికులకు సంబంధించి, కొత్త కార్మిక చట్టాలను తీసుకొచ్చిందని, వీటిని కేవలం జాతీయ స్థాయి కార్యకర్తలే అధ్యయనం చేయడం కాదని, కింది స్థాయి కార్యకర్తలు కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం వుందని ఆయన సూచించారు. కేవలం శారీరిక శ్రమ చేస్తే సరిపోదని, ప్రతి స్థాయిలో కూడా అధ్యయనం చేసే కార్యకర్తలు కావాలని, ఆందోళనలు, సంపర్కం చేసే కార్యకర్తలు కూడా కావాలని దత్తాత్రేయ హోసబళే పిలుపునిచ్చారు.
మజ్దూర్ సంఘ్ ప్రారంభం నుంచి కూడా రాజ్యశక్తి, ప్రభుత్వం ఆధారంగా సంస్థ మనుగడ కోసం ధనాన్ని సేకరించడం కాదని, కేవలం శ్రామికులు, కార్మికులు తమ రక్తాన్ని చెమటోడ్చి సంపాదించిన డబ్బుతోనే సంస్థ నడవాలన్న సంప్రదాయం వుందని, ఇప్పటికీ అదే సంప్రదాయంలో కొనసాగుతున్నామని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భాగయ్య తెలిపారు.
ప్రపంచంలోనే బీఎంఎస్ అనేది పెద్దదైన, బృహత్తరమైన సంస్థ అని చెబుతూ . సంస్థ రెండు సార్లూ ప్రథమ స్థానంలోకి వచ్చిందని, ఇందులో తెలుగు రాష్ట్రాల పాత్ర కూడా వుందని అఖిల భారతీయ సంఘటనా కార్యదర్శి సురేంద్రన్ గుర్తు చేశారు.1989, 2002 లో అత్యధిక సభ్యత్వాలు చేసిన రాష్ట్రం తెలుగు రాష్ట్రమని చెప్పారు.బీఎంఎస్ అనేది అత్యంత పెద్ద ట్రేడ్ యూనియన్ అని, ఇందులో 5,836 యూనియన్లు బీఎంఎస్ తో కలిసి నడుస్తున్నాయని తెలిపారు.
బీఎంఎస్ కి సంబంధించిన తెలంగాణ ప్రాంత కార్యాలయం ప్రారంభం కావడం ఆనందంగా వుందని బీఎంఎస్ జాతీయ అధ్యక్షులు హిరణ్మయి పాండ్య చెప్పారు. ఇందు కోసం చాలా మంది కార్యకర్తలు చెమటోడ్చారని అభినందిస్తూ ఈ నూతన కార్యాలయం కార్యకర్తలందరికీ ప్రేరణాదాయకమని అభివర్ణించారు.

More Stories
హైదరాబాద్ లో వాజ్‌పేయికు ఘన నివాళులు
నిర్మాణపర లోపాలు సరిచేసే విబి-జి రామ్ జి చట్టం 2025
విలక్షణమైన రాజకీయ వేత్త వాజపేయి