భార‌త వ్లాగ‌ర్‌ను నిర్బంధించిన చైనా

భార‌త వ్లాగ‌ర్‌ను నిర్బంధించిన చైనా
అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో డ్రాగ‌న్ దేశం చైనా గ‌త‌కొన్ని రోజులుగా క‌వ్వింపుల‌కు పాల్పడుతుంది. అరుణాచల్ తమ భూభాగమేనని పేర్కొంటోంది. అరుణాచ‌ల్‌ ప్రదేశ్‌కు జాగ్నాన్‌గా పేరు పెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో అరుణాచ‌ల్ ప్రదేశ్ త‌మ భూభాగ‌మే అని మాట్లాడే భార‌తీయుల్ని వేధింపుల‌కు గురి చేస్తోంది.  ఇటీవ‌లే షాంఘై విమానాశ్రయంలో లేఓవర్‌ సందర్భంగా అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ భారతీయ మహిళను చైనా అధికారులు వేధించినట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 
తాజాగా ఓ వ్లాగ‌ర్‌ను చైనా నిర్బంధించింది.  అనంత్ మిత్తల్‌ ‘ఆన్ రోడ్ ఇండియన్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ వీడియోల‌ను యూట్యూబ్‌లో పోస్టు చేస్తుంటాడు. ఇటీవ‌లే అత‌డు చైనా వెళ్లాడు. అయితే, అక్కడ త‌న‌కు ఎదురైన అనుభ‌వాన్ని సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించాడు. గ్వాంగ్‌జౌ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేష‌న్ ప్రక్రియ స‌మ‌యంలో కొంద‌రు అధికారులు త‌న‌ను ప‌క్కకు తీసుకెళ్లిన‌ట్లు చెప్పాడు. 
 
ఓ ప్రాంతంలో నిర్బంధించిన‌ట్లు వివ‌రించాడు. ఆ స‌మ‌యంలో క‌నీసం ఆహారం కూడా ఇవ్వలేద‌ని పేర్కొన్నాడు. అక్కడి భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని సంప్రదించేందుకు కూడా అనుమ‌తించ‌లేద‌ని ఆవేద‌న వ్యక్తం చేశాడు. త‌న ల‌గేజీని మొత్తం త‌నిఖీలు చేశార‌ని, ఐప్యాడ్ మినహా త‌న‌ దగ్గరున్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్లు వివ‌రించాడు.  దాదాపు 15 గంట‌ల‌పాటూ త‌న‌ను నిర్బంధంలోనే ఉంచిన‌ట్లు పేర్కొన్నాడు.
విచార‌ణ అనంత‌రం విడుద‌ల చేసిన‌ట్లు వెల్లడించాడు. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా బాధించింద‌ని ఆవేద‌న వ్యక్తం చేశాడు. అరుణాచ‌ల్ ప్రదేశ్ విషయంలో తాను తీసుకున్న స్టాండ్ వల్లే ఈ సమస్య వచ్చిందని అత‌డు పేర్కొన్నాడు. కాగా, ట్రాన్సిట్‌ హాల్ట్‌ సందర్భంగా తన భారతీయ పాస్‌పోర్టును గుర్తించడానికి నిరాకరించిన చైనా ఇమిగ్రేషన్‌ అధికారులు షాంఘై విమానాశ్రయంలో తనను 18 గంటలపాటు బంధించి తీవ్ర వేధింపులకు గురి చేశారని అరుణాచల్‌ ప్రదేశ్‌ మహిళ థోంగ్‌దోక్‌ ఆరోపించిన విష‌యం తెలిసిందే. 

ఈ నెల 21న లండన్‌ నుంచి జపాన్‌ ప్రయాణిస్తూ మూడు గంటల పాటు షాంఘై ఎయిర్‌పోర్టులో లే ఓవర్‌ నిమిత్తం ఆమె ఆగారు. పాస్‌పోర్టులో తన పుట్టిన ప్రదేశం అరుణాచల్‌ ప్రదేశ్‌ అని ఉన్న కారణంగా తన పాస్‌పోర్టు చెల్లదని ఇమిగ్రేషన్‌ కౌంటర్‌ అధికారులు ప్రకటించారని ఆమె ఆరోపించారు. ఈ వేధింపులపై ఆమె ప్రధాని మోదీకి కూడా లేఖ రాసిన‌ట్లు చెప్పారు.