ఒడిశాలోని కందమాల్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్ గణేశ్ ఉయికే హతమయ్యాడు. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అతడితోపాటు మరో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోస్ట్ చేశారు. హనుమంతు స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామం అని అధికారులు తెలిపారు
“ఒడిశాలోని కంధమాల్‌లో జరిగిన ఒక భారీ ఆపరేషన్‌లో, కేంద్ర కమిటీ సభ్యుడు గణేశ్ ఉయికేతో సహా 6 మంది నక్సలైట్లు ఇప్పటివరకు హతమయ్యారు. ఈ కీలక విజయంతో, ఒడిశా నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందడానికి అంచున నిలిచింది. 2026 మార్చి 31వ తేదీలోపు నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మేం కట్టుబడి ఉన్నాం” అని అమిత్ షా పోస్ట్ చేశారు. ఉయికే గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన మావోయిస్టుల బలం పెంచడం కోసం ఎంతో కృషిచేశారు.
ఆయన తలపై రూ.1.1 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోగల కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. మొత్తం 23 టీమ్‌లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని, అందులో 20 స్పెషల్ ఆపరేషన్ టీమ్స్, రెండు సీఆర్‌పీఎఫ్ టీమ్స్, ఒక బీఎస్ఎఫ్ టీమ్ ఉన్నాయని చెప్పారు. ఈ కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా ఎదురుపడిన మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయని భద్రతా బలగాలు వెల్లడించాయి.
కాల్పుల్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతిచెందగా, వారిలో గణేశ్ ఉయికే తోపాటు రాయగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు బారి అలియాస్ రాకేష్, చమ్రు, రూప ఉన్నారు. మిగతా ఇద్దరిని గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో ఒక రివాల్వర్, పాయింట్ 303 రైఫిల్, ఒక వాకీ-టాకీ సెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గణేశ్ ఉయికే తలపై రూ.1.1 కోట్ల రివార్డు ఉండగా, బారి తలపై రూ.22 లక్షలు, అమృత్ తలపై రూ.1.65 లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు.

More Stories
హమాస్ నేత హనియాను హత్య ముందు కలుసుకున్న గడ్కరీ!
కాంగ్రెస్ లో ప్రియాంక గాంధీ నాయకత్వంపై దుమారం!
20 ఏళ్ల తర్వాత ఏకమైన ఠాక్రే సోదరులు