ఆరావళి పర్వతాల్లో మైనింగ్ కార్యకలాపాలు నిషేధిస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి కొత్తగా ఎవరికీ మైనింగ్ లీజు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. పర్వత శ్రేణి సమగ్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
“ఈ నిషేధం మొత్తం ఆరావళి భూభాగం అంతటా వర్తిస్తుంది. పర్వత శ్రేణి సమగ్రతను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. గుజరాత్ నుంచి ఎన్ సీఆర్ వరకు విస్తరించి ఉన్న ఆరావళిని రక్షించేందుకు, అక్కడ మైనింగ్ కార్యకలాపాలను ఆపడమే ఈ ఆదేశాలు ముఖ్య ఉద్దేశం” అని కేంద్రం స్పష్టం చేసింది.
“పర్యావరణ, భౌగోళిక, ప్రకృతి దృశ్య స్థాయి పరిగణనల ఆధారంగా కేంద్రం ఇప్పటికే ఆరావళి పర్వతాల్లో మైనింగ్ కార్యకలాపాలను నిషేధించింది. ఇంకా మైనింగ్ నిషేధించాల్సిన అదనపు ప్రాంతాలు, మండలాలను గుర్తించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసిఎఫ్ఆర్ఈ)ని పర్యావరణ, అటవీ శాఖ ఆదేశించింది” అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఆరావళి పర్వతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిర్వచనాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ 20న ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఒకటికిపైగా ఆరావళి పర్వతాలు, పక్కపక్కనే సగటున 500 మీటర్ల దూరంలో ఉంటే వాటి మధ్య ఉన్న భూమిని కూడా ఆరావళి పర్వత శ్రేణిగానే భావిస్తారు.
ఈ పర్వత శ్రేణుల పరిధిలో పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో మైనింగ్‌ను పూర్తిగా నిషేధించింది సుప్రీంకోర్టు. సుస్థిర మైనింగ్ నిర్వహణ ప్రణాళిక (ఎంపీఎస్‌ఎం) సిద్ధమయ్యే వరకు ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆధేశించింది సుప్రీంకోర్టు. మరోవైపు, ఆరావళి పర్వతాలపై నెలకొన్న వివాదంపై స్పందిస్తూ పురాతన పర్వత శ్రేణిపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఇటీవల ఇచ్చిన స్పష్టతలు మరిన్ని ప్రశ్నలను, సందేహాలను లేవనెత్తుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కేంద్రంపై మండిపడ్డారు.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వతాల్లో ఆరావళి పర్వత శ్రేణులు కూడా ఒకటి. గుజరాత్, రాజస్థాన్, హరియాణా, ఢిల్లీ కి సహజ సిద్ధ పర్యావరణ రక్షణ కవచం లాంటి ఈ పర్వతాలకు కేవలం ‘ఎత్తు’ ఆధారంగా కొత్త నిర్వచనం ఇవ్వడంపై విపక్షాలు, పర్యావరణ పరిరక్షకులు మండిపడుతున్నారు. ఆరావళి పర్వతాల పరిసరాల్లోని లోతట్టు, దిగువ ప్రాంతాల్లో కొందరి కోసం మైనింగ్ అవకాశాలను సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం తాపత్రయ పడుతోందని విమర్శిస్తున్నారు. ఆరావళి పర్వత శ్రేణుల్లో 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న దాన్నే ఆరావళి పర్వతంగా పరిగణిస్తామని అనడం సరికాదని అంటున్నారు.

More Stories
నిర్మాణపర లోపాలు సరిచేసే విబి-జి రామ్ జి చట్టం 2025
విలక్షణమైన రాజకీయ వేత్త వాజపేయి
కాంగ్రెస్ లో ప్రియాంక గాంధీ నాయకత్వంపై దుమారం!