కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ప్రియాంక గాంధీ చేతుల్లో పెట్టాలనే వాదన ఎప్పటి నుంచో ఉంది. పైగా గత కొద్ది కాలంగా దేశంలో జరుగుతున్న ఏ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపడం లేదు. దీంతో నాయకత్వ మార్పు జరగాలంటూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే, ఉంటే బీజేపీ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తోందని, ప్రియాంక, రాహుల్ గాంధీల మధ్య పార్టీ అధ్యక్ష బాధ్యతలకు సంబంధించిన అంశంపై ఎంతో కాలంగా పోరు నడుస్తోందని ఆరోపిస్తూ వస్తుంది.
ఇటువంటి సమయంలో ప్రియాంక గాంధీ “పెద్ద పదవి”కి అన్ని విధాలా అర్హురాలు అంటూ ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్వయంగా పేర్కొనడం కాంగ్రెస్‌లో ముదురుతున్న నాయకత్వ పోరుగా పలువురు భావిస్తున్నారు. రాహుల్ – ప్రియాంక వర్గాలుగా ఆ పార్టీ చీలిపోయిందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. మొన్న శీతాకాల సమావేశాల్లో ప్రియాంక గాంధీ ఉపన్యాసం పలువురిని ఆకట్టుకుంది. రాజకీయంగా కీలక సమయాల్లో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో బిజీగా ఉండటం, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా చాలాసార్లు అందుబాటులో ఉండకపోవడం, ప్రచారం చేసిన ప్రతిచోటా కాంగ్రెస్ ఓటమి పాలవడంతో సహజంగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ఆయన నాయకత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది.
సీనియర్ పాత్రికేయురాలు స్వాతి చతుర్వేది ఇదే అంశం గురించి ఎన్‌డీ టీవీ వెబ్‌సైట్లో రాస్తూ రాహుల్ తరచూ అందుబాటులో లేకుండా పోవడం, పార్టీకి సమయం ఇవ్వకపోవడం వల్ల పార్టీ సీనియర్ నాయకత్వం అసంతృప్తిగా ఉన్నారని, వారు ప్రియాంకా గాంధీని తెరమీదికి తేవాలనుకుంటున్నారని రాసింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మీడియాతో మాట్లాడుతూ ప్రియాంకా గాంధీని ప్రధానమంత్రి చేస్తే ఇందిరా గాంధీ లాగా శక్తివంతమైన నేతగా పరిపాలిస్తారని అంటూ కాంగ్రెస్ లో సరికొత్త రచ్చకు తెరతీశారు.
రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ ప్రియాంక చాలా కష్టపడుతుంది. రాజకీయాలు, జీవితం గురించి ఆమె తన నానమ్మ ఇందిరా గాంధీ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంది. ఆమె నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వారి సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుంది. రాజకీయాల్లో ఆమెకు చాలా భవిష్యత్తు ఉంది. దేశ ప్రజలు ప్రియాంకలో ఆమె నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని చూస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రధానిగా ప్రియాంక ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు మద్దతిస్తున్నారు కూడా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదే సందర్భంలో రాబర్ట్ వాద్రా రాహుల్ గాంధీ గురించి కూడా ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారని అంటూ ప్రియాంక, రాహుల్ గాంధీ రక్తంలోనే రాజకీయాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలానే తనను కూడా రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కానీ బీజేపీ మాత్రం నెపోటిజమ్ పేరుతో రాజకీయం చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తోంది అంటూ ఆ పార్టీపై నెపం నెట్టివేశారు. రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వారసత్వ పోరు గురించి చెప్పకనే చెప్పిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు
ప్రియాంక గాంధీకి పార్టీ అప్పగించాలనే వాదన గత కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఆ పార్టీకి చెందిన ఒడిశాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఒకరు పార్టీ బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగించాలని కోరుతూ నేరుగా సోనియా గాంధీకే లేఖ రాశారు. దానితో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
ఇక కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీని ప్రధాన మంత్రిని చేస్తే తను పాకిస్థాన్ భరతం పడుతుందని, ఆమె ఇందిరా గాంధీ మనవరాలంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేక ఇబ్బందుల్లో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు ఈ నేతల వ్యాఖ్యలు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి.
ఇలా ఉండగా, ప్రియాంక గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్నాయన్నాంటూ జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తోసిపుచ్చారు. ఇవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీనే తమకు, తన పార్టీ కార్యకర్తలకు నాయకుడని చెప్పారు. ప్రధానమంత్రి కావాలనే కోరిక ప్రియాంకగాంధీకి కూడా లేదని, రాహుల్‌ను దేశ ప్రధానిని చేసేందుకు ఆమె కట్టుబడి ఉన్నారని తెలిపారు.
More Stories
నిర్మాణపర లోపాలు సరిచేసే విబి-జి రామ్ జి చట్టం 2025
హమాస్ నేత హనియాను హత్య ముందు కలుసుకున్న గడ్కరీ!
విలక్షణమైన రాజకీయ వేత్త వాజపేయి