మహారాష్ట్ర రాజకీయాల్లో దాదాపు 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు ఏకమయ్యారు. శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నప్పుడే 2005లో ఆ పార్టీని వీడిన రాజ్ ఠాక్రే, ఇప్పుడు మరోసారి ఉద్ధవ్ ఠాక్రేతో జట్టు కట్టారు. ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఉద్ధవ్-రాజ్‌ఠాక్రేలు జనవరి 15న జరిగే బృహన్ ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబయి మేయర్ పదవి తమదేనని శివసేన యుబిటి అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్‌సేన అధినేత రాజ్‌ఠాక్రేలు ధీమా వ్యక్తంచేశారు. అదే రోజు జరిగే నాశిక్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల కోసం ఇప్పటికే రెండు పార్టీల మధ్య స్థానాల సర్దుబాటు చర్చలు పూర్తయ్యాయని ప్రకటించారు. త్వరలో ముంబయికి తమ పార్టీల నుంచి మరాఠీ మేయర్ రాబోతున్నారని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన బటేంగే తో కాటేంగే నినాదాన్ని జపించిన ఉద్ధవ్‌ఠాక్రే, ఐక్యత లోపిస్తే పరిస్థితి వినాశకరంగా ఉంటుందని తెలిపారు. శిందే-శివసేన-బీజేపీలతో అసంతృప్తిగా ఉన్న నేతలంతా తిరిగి తమ పార్టీల్లో చేరాలని రాజ్‌ఠాక్రే పిలుపునిచ్చారు. 2005లో ఉద్ధవ్‌ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాల్ ఠాక్రేను నియమించడంపై అసంతృప్తితో రాజ్, శివసేనను వీడి, ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించారు.
తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఉద్ధవ్ నేతృత్వంలో శివసేన తమ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న బీజేపీని విడిచిపెట్టి కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. తర్వాత మహారాష్ట్రలో బీజేపీ బలోపేతం కావడం, శివసేనను ఏక్నాథ్ శిందే రెండు వర్గాలుగా చీల్చడం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, శివసేన-యుబిటి, శరద్‌పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీని తిరస్కరించారు. ఈ క్రమంలో మరాఠీ భాష ప్రాధాన్యానికి సంబంధించిన పరిణామాలు వీరిద్దరిని మళ్లీ దగ్గరకు చేర్చాయి.
ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థికంగా దేశంలోనే అతిపెద్దది. ముంబయి బడ్జెట్ కేరళ రాష్ట్ర బడ్జెట్‌కు సమానం. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌పై నియంత్రణ సాధించడం అత్యంత కీలకంగా మారడంతో ఉద్ధవ్, రాజ్ జట్టు కట్టారు. మరోవైపు హిందీ మాట్లాడే ఓటర్లను దూరం చేసుకోకుండా ఉండేందుకు కాంగ్రెస్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ ఇద్దరు సోదరులకు దూరంగా ఉండనుంది.
అయితే, వీరిద్దరి కలయికను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కొట్టిపారవేసారు. ఏదో రష్యా, ఉక్రెయిన్ ఒకటైన్నట్లు వీరిద్దరి కలయికను చూస్తున్నారని, అయితే, వారిద్దరూ సంతృప్త రాజకీయాలతో ప్రజావిశ్వాసం కోల్పోయారని, తమ ఉనికి కాపాడుకోవడం కోసమే వారిద్దరి దగ్గరకు వస్తున్నారని స్పష్టం చేశారు.

More Stories
హమాస్ నేత హనియాను హత్య ముందు కలుసుకున్న గడ్కరీ!
కాంగ్రెస్ లో ప్రియాంక గాంధీ నాయకత్వంపై దుమారం!
బంగ్లాదేశ్‌లో మూకదాడిపై భారత్‌లో ఆగ్రహ జ్వాల