అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు అనూహ్య స్పందన

అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు అనూహ్య స్పందన
అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రతి జిల్లాలో వాజ్‌పేయి విగ్రహాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంటూ నేటి తరానికి వాజ్‌పేయి విలువలు ఆదర్శమని చెప్పారు. వాజ్‌పేయి గొప్పతనం తెలుసుకుని అందరూ ఆశ్చర్యవ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 
 
ఈ సుపరిపాలన యాత్ర గురించి చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాయుడు ఆనందం వెలిబుచ్చారని, ఈ యాత్రకు కూటమిపరంగా , ప్రభుత్వపరంగా సహకారం అందించారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  ఈ యత్రలు, సభల్లో‌ కూటమి పార్టీల నేతలను భాగస్వామ్యం చేశారని సంతోషం వ్యక్తం చేశారు. అటల్, చంద్రబాబులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 
 
సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లకు నాడు వాజ్‌పేయి సహకారం అందించారని మాధవ్ గుర్తుచేశారు. సుపరిపాలన యాత్రలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారని చెప్పారు. వాజ్‌పేయి ఈ దేశానికి చేసిన సేవకు, త్యాగాలను గురించి అందరూ ముక్త కంఠంతో కీర్తిస్తున్నారని తెలిపారు.  ఈనెల 25న వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా అమరావతిలో స్మృతి వనం, విగ్రహాన్ని‌ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని తెలిపారు. అమరావతిలోని వెంకటపాలెం వద్ద ఉన్న ‘అటల్ జీ స్మృతి వన్’ లో  విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది 14 అడుగుల ఎత్తు గల భారీ కాంస్య విగ్రహం. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి విగ్రహం ఇదే కావడం విశేషం  అని ఈ ప్రాంతాన్ని కేవలం విగ్రహావిష్కరణకే పరిమితం చేయకుండా, వాజ్‌పేయి జీవిత విశేషాలను తెలిపే మ్యూజియం తరహా స్మారక చిహ్నంగా అభివృద్ధి చేస్తున్నారు

ధర్మవరం నుంచి అమరావతి వరకు తమ యాత్రకు ప్రజలు నుంచి విశేష ఆదరణ లభించిందని చెబుతూ జాతీయ రహదారుల నిర్మాణం, గ్రామాలకు రోడ్లు, ఐటీ, టెలికం, పొలిటికల్ కనెక్టివిటీలకు ఆద్యులు వాజ్‌పేయి అని మాధవ్ కొనియాడారు.  రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే తేడా లేకుండా ప్రజలు నుంచి వస్తున్న స్పందన అపూర్వమని చెప్పారు. నేటి యువతరం, భవిష్యత్తుతరాలు వాజ్‌పేయి గొప్పతనం తెలుసుకోవాలని సూచించారు. తాము ఏర్పాటు చేసిన విగ్రహాలు, యాత్ర ద్వారా వాజ్‌పేయి నుంచి చాలా మంది స్పూర్తి పొందుతున్నారని పేర్కొన్నారు.

వాజ్‌పేయి ఆశయాలకు అనుగుణంగా మోదీ అద్భుతమైన పాలన సాగిస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని తెలిపారు. 2047 నాటికి‌ వికసిత భారత్, వికసిత్ ఏపీ కోసం అందరం క‌లిసి పని చేస్తామని స్పష్టం చేశారు. సుపరిపాలన యాత్రలకు, సభలకు సహకారం అందించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈనెల 25న జరిగే వాజ్ పేయి భారీ విగ్రహం ఆవిష్కరణ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పిలుపునిచ్చారు.