రాహుల్ జరుపుతుంది ‘భారత్ బద్‌నామ్ యాత్ర’

రాహుల్ జరుపుతుంది ‘భారత్ బద్‌నామ్ యాత్ర’

* బెర్లిన్ లో రాహుల్ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలపై బిజెపి నాయకుల మండిపాటు!

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ రాజధాని బెర్లిన్‌లో కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. హర్టీ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్ గాంధీ, భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వతంత్ర సంస్థలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తోందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఎన్నికల కమిషన్ వంటి సంస్థలను రాజకీయ ఆయుధాలుగా వాడుకుంటోందని విమర్శించారు.

భారత్‌లో సంస్థలన్నీ బీజేపీ ఆధీనంలోకి వెళ్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా ఈడీ, సీబీఐలు ప్రతిపక్ష నేతలపై మాత్రమే కేసులు పెడుతున్నాయని, అధికార పార్టీ నేతలపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. వ్యాపారులు కాంగ్రెస్‌కు మద్దతిస్తే బెదిరింపులు ఎదుర్కొవాల్సి వస్తోందని తెలిపారు.

వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. హరియాణా ఎన్నికల్లో తాము గెలిచామని, మహారాష్ట్ర ఎన్నికలు న్యాయంగా జరగలేదని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తి పేరు పలుమార్లు నమోదైనట్లు ఆధారాలు చూపించినా ఎన్నికల కమిషన్ స్పందించలేదన్నారు. హరియాణాలో ఒక బ్రెజిలియన్ మహిళ పేరు 22 సార్లు ఓటర్ల జాబితాలో ఉందని ఉదాహరణగా పేర్కొన్నారు.

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ రాహుల్ గాంధీని “పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడు” అని అభివర్ణించారు. ఎన్నికల సమయంలో మాత్రమే బీహార్‌ను సందర్శిస్తారని, ఎన్నికలు ముగిసిన తర్వాత దేశం విడిచి వెళ్తారని ఎద్దేవా చేశారు.

పాట్నాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నబిన్ మాట్లాడుతూ, ఇటీవలి జర్మనీ పర్యటనలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశాన్ని అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆయన (రాహుల్ గాంధీ) భారతదేశంలో ఉన్నప్పుడు, భారత ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తారు. ఆయన సుప్రీంకోర్టును విమర్శిస్తారు. అటువంటి రాజకీయ నాయకులను శిక్షించాల్సిన సమయం ఆసన్నమైంది” అని కూడా నబిన్ ఆరోపించారు.

బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ, విదేశీ పర్యటనలు అంటే భారత్‌ను విమర్శించడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. భారత్‌ను అవమానించడం, చైనాకు పరోక్షంగా మద్దతివ్వడం కాంగ్రెస్ నేతల స్వభావమని ఆరోపించారు. భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.

బీజేపీ జాతీయ ప్రతినిధి సీఆర్ కేశవన్ మరింత తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీని ‘మోడ్రన్ డే గెబ్బెల్స్’గా అభివర్ణించిన ఆయన, భారత్‌ను అంతర్జాతీయంగా దూషించడం రాహుల్ లక్ష్యమని దయ్యబట్టారు. జార్జ్ సోరోస్ మాటలను అనుకరిస్తూ దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్‌ను లీడర్ ఆఫ్ ప్రొపగాండాగా పేర్కొన్న ఆయన, విదేశీ పర్యటనలను ‘భారత్ బద్‌నామ్ యాత్ర’గా ఎద్దేవా చేశారు.

కేంద్ర మంత్రి, బీజేపీ నేత శోభా కరంద్లాజే కూడా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కాదని, దేశ వ్యతిరేక నేత అని విమర్శించారు. విదేశాలకు వెళ్లి భారత్‌పై విమర్శలు చేయడం ద్వారా ఏమి సాధించాలని చూస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఓ పార్టీకి అగ్రనేతగా ఉన్నప్పటికీ ఇంకా చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నారని ఆమె మండిపడ్డారు. గత 11 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ స్థాయిలో బలమైన దేశంగా ఎదిగిందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. స్వయం సమృద్ధి సాధించిన భారత్‌ను చూసి రాహుల్ గాంధీ తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ప్రజల మద్దతుతో బీజేపీ వరుసగా విజయం సాధిస్తుండటమే రాహుల్ విమర్శలకు కారణమని ఆమె ధ్వజమెత్తారు.