మాజీ ప్రధాని పివి వర్ధంతి సందర్భంగా బిజెపి నివాళులు

మాజీ ప్రధాని పివి వర్ధంతి సందర్భంగా బిజెపి నివాళులు
మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ ఘాట్ వద్ద బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలను, దేశానికి అందించిన విశేష సేవలను ఆయన స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు గారు మీడియాతో మాట్లాడుతూ పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని కొత్త దారిలో నడిపించారని కొనియాడారు.
ఆ సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, దేశహితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించారని,  ప్రతిపక్షంతో కలిసి దేశాన్ని ఒక సరైన ట్రాక్‌పై పెట్టిన అరుదైన నాయకత్వం అదని ప్రశంసించారు.  ఇలాంటి గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఎదిగి, ముఖ్యమంత్రిగా పనిచేసి, కేంద్రంలో హెచ్‌ఆర్‌డీ మంత్రిగా సేవలందించి, చివరకు దేశ ప్రధానమంత్రి అయిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు.
గాంధీ కుటుంబంలో పుట్టిన వారికే కాంగ్రెస్ పార్టీ మర్యాద దక్కుతుందా? అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు.  ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించనీయకుండా, హైదరాబాద్‌కు తీసుకువచ్చి, ఇక్కడ కూడా ఆయనకు దక్కాల్సిన ప్రోటోకాల్ ఇవ్వకుండా వ్యవహరించిన ఘటన దేశమంతా చూసిందని రావు చెప్పారు. దురదృష్టవశాత్తూ, ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అదే కుటుంబకేంద్రీకృత, ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
రాజకీయాల్లో విభేదాలు ఉన్నా, దేశం కోసం పని చేసే నాయకులను గుర్తించాల్సిన బాధ్యత ప్రతి పార్టీకి ఉంటుందని స్పష్టం చేశారు.