భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
* తొమ్మిది నెల్లలోనే కుదిరిన వాణిజ్య ఒప్పందం

భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్​తో టెలిఫోన్ సంభాషణ  జరిపిన అనంతరంఇరుదేశాల నాయకులు సంయుక్తంగా భారత్- న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాల మధ్య ఎక్కువ వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణ, భాగస్వామ్య అవకాశాలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ఇరుదేశాధినేతలు అభిప్రాయపడ్డారు

2025 మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ భారత పర్యటనకు వచ్చిన సమయంలో భారత్-న్యూజిలాండ్ మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి.  9 నెలల రికార్డు సమయంలోనే భారత్- న్యూజిలాండ్ మధ్య కుదిరింది. ఇది ఇరు దేశాల రాజకీయ సంకల్పాన్ని, వ్యూహాత్మక అవగాహనను ప్రతిబింబిస్తుందని కివీస్, భారత్ ప్రధానులు లక్సన్, నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. 

ఈ ఒప్పందం డీల్ భారత్- న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను గణనీయంగా పెంచుతుంది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సరికొత్త ఆవిష్కరణలు, సప్లై చైన్ సిస్టమ్ సహకారానికి కొత్త ఊపునివ్వనుంది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేస్తుంది. వివిధ రంగాలలో రెండు దేశాల ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, విద్యార్థులు, యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది.

ఇరుదేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత రాబోయే ఐదేళ్లలో ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇరు దేశాల నాయకులు నిర్ణయించారు. అలాగే న్యూజిలాండ్ రాబోయే 15 ఏళ్లలో భారత్‌ లో 20 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు.  క్రీడలు, విద్య, ప్రజా సంబంధాలు వంటి ద్వైపాక్షిక సహకార రంగాలలో సాధించిన పురోగతిని కూడా నాయకులు స్వాగతించారు.  భారత్​తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని కొనియాడారు.

“న్యూజిలాండ్-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత నేను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ కాల్ మాట్లాడాను. ఈ ఒప్పందం ద్వారా భారత్ కు న్యూజిలాండ్ నుంచి ఎగుమతయ్యే 95 శాతం ఉత్పత్తులపై సుంకాలను ఇండియా తగ్గిస్తుంది లేదా తొలగిస్తుంది. రాబోయే రెండు దశాబ్దాలలో భారత్ కు న్యూజిలాండ్ ఎగుమతులు సంవత్సరానికి 1.1 బిలియన్ డాలర్లు నుంచి 1.3 బిలియన్ డాలర్లు వరకు పెరుగుతాయి” అని న్యూజిలాండ్ ప్రధాని తెలిపారు. 

ఇరుదేశాల మధ్య వాణిజ్యం పెరగడం వల్ల న్యూజిలాండ్ పౌరులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు, మెరుగైన వేతనాలు లభిస్తాయని  స్టోఫర్ లక్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వాణిజ్య రెండు దేశాల మధ్య బలమైన స్నేహాన్ని తెలియజేస్తుందని లక్సన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్‌ లోని 140 కోట్ల మంది వినియోగదారులకు న్యూజిలాండ్ వ్యాపార సంస్థలు చేరువయ్యేందుకు ఈ ఒప్పందం గొప్ప అవకాశమని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ (స్టెమ్) బ్యాచిలర్ గ్రాడ్యుయేట్లకు, మాస్టర్స్ గ్రాడ్యుయేట్లకు మూడేళ్ల వరకు, డాక్టరేట్ హోల్డర్లకు భారతీయ విద్యార్థులకు నాలుగు సంవత్సరాల వరకు పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు  ఈ ఒప్పందం ద్వారా లభించనున్నాయి. అదనంగా, కొత్త తాత్కాలిక ఉపాధి ప్రవేశ వీసా వచ్చింది. ఇది నైపుణ్యం కలిగిన వృత్తులలో ఉన్న 5,000 మంది భారతీయ నిపుణులు ఎప్పుడైనా మూడేళ్ల వరకు న్యూజిలాండ్‌ లో ఉండడానికి వీలు కల్పిస్తుంది.