అవి రాజ్యాంగ వ్యతిరేకం అంటూ ఎలెక్టోరల్ బోండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసిన్నప్పటికీ, వాటి ద్వారా అత్యధికంగా విరాళాలు పొందుతున్న బిజెపికి గత ఏడాది 68 శాతం పైగా విరాళాలు పెరిగాయి. ఇప్పుడు ఎలెక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు సమకూర్చుతున్న విరాళాలు సుమారు రెండు రేట్లు పెరగడమే కాకుండా, వాటిల్లో 82 శాతం మేరకు బీజేపీకి అందాయి.
2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.6654 కోట్లు బిజెపికి విరాళంగా అందినట్లు ఆ పార్టీ ఎన్నికల కమిషన్ కు సమర్పించిన ఆడిట్ నివేదికల ప్రకారం వెల్లడయింది. లోక్‌సభ ఎన్నికలు జరిగిన సంవత్సరంలో ఆ పార్టీకి గత ఏడాదితో పోలిస్తే 68 శాతం విరాళాలు పెరిగినట్లు ఎన్నికల సంఘం రిపోర్టులో తెలిసింది. ప్రస్తుతం ఈసీ వెబ్‌సైట్‌లో ఆ రిపోర్టు ఉన్నది.
కాగా, రూ 20 వేల కన్నా ఎక్కువ విరాళం అందుకున్న పార్టీ వివరాలు మాత్రమే ఆ వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ఆ నివేదిక ప్రకారం ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 30, 2025 వరకు విరాళాలు ముట్టినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఏపీ, ఒడిశా, జమ్మూకశ్మీర్, హర్యానా, జార్ఖండ్,మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు.
2023-2024 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ. 3967 కోట్లు విరాళంగా అందాయి. అయితే ఈసారి మాత్రం ఆ విరాళాలు 68 శాతం పెరిగినట్లు రిపోర్టులో తెలిపారు. బీజేపీకి వచ్చిన విరాళాల్లో సుమారు 40 శాతం విరాళాలు ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి వచ్చినట్లు తేల్చారు. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ. 2180 కోట్ల విరాళం అందజేయగా, ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ. 757 కోట్లు, న్యూ డెమోక్రాటిక్ ఎలక్టోరల్ ట్రస్టు రూ. 150 కోట్లు అందించాయి.
ఇక ఇతర ట్రస్టుల నుంచి సుమారు రూ. 3112.5 కోట్లు బీజేపీకి విరాళంగా వచ్చినట్లు తెలిసింది. సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా సుమారు వంద కోట్లు విరాళం ఇచ్చింది. రుంగ్తా సన్స్ ప్రైవేటు సంస్థ రూ. 95 కోట్లు, వేదాంత రూ. 67 కోట్లు, మాక్రోటెక్ డెవలపర్స్ రూ. 65 కోట్ల, బజాజ్ గ్రూపు కంపెనీలు రూ. 65 కోట్లు, డిరైవ్ ఇన్వెస్టిమెంట్స్ సుమారు రూ. 50 కోట్లు విరాళం ఇచ్చాయి.
మలాబార్ గోల్డ్ రూ.10 కోట్లు, కళ్యాణ్ జ్వలర్స్ రూ. 15 కోట్లు, హీరో గ్రూపు రూ. 23 కోట్లు, దిలీప్ బిల్డ్ఐకాన్ గ్రూపు రూ. 29 కోట్లు, ఐటీసీ లిమిటెడ్ రూ. 35 కోట్లు, వేవ్ ఇండస్ట్రీస్ రూ. 6 కోట్లు, జిరోదా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ రూ. 1.5 కోట్లు విరాళం అందజేశాయి. కాగా, 2023-24 సీజన్‌లో రూ. 1129 కోట్లు అందుకున్న కాంగ్రెస్ పార్టీకి, గత ఏడాది 43 శాతం తక్కువగా విరాళాలు అందాయి.

More Stories
భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
26 నుంచి రైల్వే చార్జీలు పెరుగుదల
విలువ సృష్టించే దశకుమారుతున్న తయారీరంగం