భారత్ తో బంగ్లా సంబంధాలు దెబ్బతినే అవకాశం!

భారత్ తో బంగ్లా సంబంధాలు దెబ్బతినే అవకాశం!
బంగ్లాదేశ్ లో ప్రస్తుత గందరగోళం పొరుగున ఉన్న ఇతర దేశాలతో, ముఖ్యంగా భారత్ తో ఢాకా సంబంధాలను అస్థిరపరుస్తుందని  పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నియమించిన తాత్కాలిక ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.  మైనారిటీల హత్యలపై  ఆందోళన చేస్తూ భారతదేశం ఈ ‘గందరగోళాన్ని’ చూస్తున్నట్లు ఆమె చెప్పారు. 
 
యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యపై గత వారం బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. ఫిబ్రవరి 12న జరిగే పార్లమెంటు ఎన్నికల కోసం ఢాకాలో ప్రచారం చేస్తున్న సమయంలో 32 ఏళ్ల వ్యక్తిపై కాల్పులు జరిగాయి. దేశంలో 27 ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్య కూడా జరిగింది. బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ల వెలుపల నిరసనలకు సంబంధించిన భద్రతా సమస్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబారిని పిలిపించిన కొన్ని రోజుల తర్వాత హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు.
 
ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇమెయిల్ ఇంటర్వ్యూలో హసీనా మాట్లాడుతూ, యూనస్ ప్రభుత్వం హయాంలో హింస రెట్టింపు అయిందని, దానిని ఆపడానికి అది ‘శక్తిలేనిది’గా మారిపోయిందని ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్ విశ్వసనీయత అంతర్జాతీయ వేదికపై కుప్పకూలిపోతోందని మాజీ ప్రధాన మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే దేశంలో ‘ప్రాథమిక క్రమం’ లేదు” అని ఆమె చెప్పారు. 
 
భారతదేశం దశాబ్దాలుగా బంగ్లాదేశ్‌కు అత్యంత దృఢమైన స్నేహితుడు, భాగస్వామి అని పేర్కొంటూ మన దేశాల మధ్య సంబంధాలు లోతైనవి, ప్రాథమికమైనవి, అవి ఏ తాత్కాలిక ప్రభుత్వాన్నైనా అధిగమిస్తాయని ఆమె యూనుస్ ప్రభుత్వంకు చురకలు అంటించారు. “చట్టబద్ధమైన పాలన పునరుద్ధరించిన తర్వాత”, బంగ్లాదేశ్ తన 15 సంవత్సరాల పదవీకాలంలో పెంపొందించుకున్న “సముచిత భాగస్వామ్యం”కి తిరిగి వస్తుందని ఆమె ధృడ విశ్వాసం వ్యక్తం చేశారు. 
బంగ్లాదేశ్‌లో రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల పెరుగుదలను కూడా హసీనా ప్రస్తావిస్తూ  జమాత్-ఇ-ఇస్లామిపై నిషేధాన్ని ఎత్తివేసినందుకు యూనస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. యూనస్ తీవ్రవాదులను క్యాబినెట్ పదవుల్లో ఉంచారని, దోషులుగా తేలిన ఉగ్రవాదులను జైలు నుండి విడుదల చేశారన,  “అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న సమూహాలను ప్రజా జీవితంలో పాత్రలు పోషించడానికి అనుమతించారు” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
అంతర్జాతీయ వేదికపై తమను తాము ఆమోదయోగ్యమైన వ్యక్తిగా చూపించుకోవడానికి రాడికల్ ఇస్లామిస్టులు యూనస్‌ను ఉపయోగిస్తున్నారని తాను భయపడుతున్నానని హసీనా పేర్కొన్నారు. ప్రధాన సలహాదారుడు రాజకీయ నాయకుడు కానందున ‘సంక్లిష్ట’ దేశాన్ని పరిపాలించడంలో అనుభవం లేదని ఆమె దుయ్యబట్టారు.