* భారత్ `హిందూ రాష్ట్ర’ అనేందుకు రాజ్యాంగ ఆమోదం అవసరం లేదు
పశ్చిమ బెంగాల్ లో ‘బాబ్రీ మసీదు’ నమూనా నిర్మాణం ప్రయత్నాల వెనుక రాజకీయ కుట్ర ఉందని, ఇది రెండు వర్గాల మధ్య విభేదాలను మరింత పెంచుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ హెచ్చరించారు. బాబ్రీ మసీదు వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసిందని, ఆ స్థలంలో రామ మందిరం నిర్మాణం జరిగిందని పేర్కొంటూ, “బాబ్రీ మసీదును మళ్లీ నిర్మించడానికి ప్రయత్నించడం ద్వారా వివాదాన్ని తిరిగి ప్రారంభించడం ఒక రాజకీయ కుట్ర. ఇది ఓట్ల కోసం చేస్తున్నారు” అని ఆరోపించారు.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా కలకత్తాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొంటూ ఆ విధంగా చేయడం అటు ముస్లింలకు గానీ, ఇటు హిందువులకు గానీ ఏమాత్రం ప్రయోజనకరం కాదని ఆయన స్పష్టం చేశారు. ఒక వివాదం ముగిసి, సద్భావన నెలకొందని, ఇప్పుడు మరోసారి రెండు వర్గాల మధ్య విభేదాలను మరింత పెంచే ప్రయత్నం జరుగుతోందని ఆయన తెలిపారు.
ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగాలో ‘బాబ్రీ మసీదు’ నిర్మించాలని సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మసీదు నిర్మించ తలపెట్టిన స్థలానికి వేలాది మంది ఇటుకలు మోసుకెళ్లారు. ప్రతి రోజూ వందలాది మంది ఆ స్థలాన్ని సందర్శిస్తున్నారు.
ప్రభుత్వం దేవాలయాలు లేదా ఏ ఇతర ప్రార్థనా స్థలాలను నిర్మించకూడదని కూడా భగవత్ తేల్చి చెప్పారు. “ప్రభుత్వం దేవాలయాలు లేదా ఏ మతపరమైన ప్రదేశాలను నిర్మించకూడదు. అదే నియమం. సోమనాథ్ ఆలయం నిర్మించినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రిగా ఉన్నారు. రాష్ట్రపతి దాని ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కానీ ప్రభుత్వ డబ్బును ఉపయోగించలేదు” అని గుర్తు చేశారు.
అదేవిధంగా, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామ మందిరం నిర్మించారని, ట్రస్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరగా, వారు అలా చేశారని చెబుతూ ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదని, మనమందరం విరాళాలు ఇచ్చామని ఆయన తెలిపారు. ఇటీవల, పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం దీఘాలో జగన్నాథ ఆలయాన్ని ఏర్పాటు చేసింది. రాజర్‌హాట్‌లో దుర్గా అంగన్, సిలిగురిలో మహాకాల్ ఆలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
హిందువులు ఐక్యమైతే బెంగాల్‌లో రాజకీయ మార్పు
పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ మార్పు కోసం హిందూ శక్తులు ఐక్యమవ్వాలని భగవత్ పిలుపునిచ్చినప్పటికీ, రాజకీయ మార్పు గురించి ఆలోచించడం తన పని కాదని, సంఘ్ సామాజిక మార్పుపై ఆసక్తి చూపుతుందని ఆయన స్పష్టం చేశారు.
“హిందూ సమాజం ఐక్యంగా నిలబడితే, బెంగాల్‌లోని పరిస్థితిని మార్చడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇక రాజకీయ మార్పుపై నా ఆలోచనల విషయానికొస్తే, రాజకీయ మార్పు గురించి ఆలోచించడం నా పని కాదని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మేము సంఘం ద్వారా సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్నాము,” అని సర్ సంఘచాలక్ తెలిపారు.
బంగ్లాదేశ్‌లోని పరిస్థితిపై వ్యాఖ్యానిస్తూ, బంగ్లాదేశ్‌లో హిందువులు మైనారిటీగా ఉన్నందున పరిస్థితి చాలా కష్టంగా ఉందని డా. భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. “పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ, గరిష్ట రక్షణ కోసం, అక్కడి హిందువులు ఐక్యంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వారికి సహాయం చేయాలి. మన పరిమితులకు లోబడి మనం చేయగలిగినంత సహాయం వారికి చేయాలి. మేము అది చేస్తున్నాము,” అని ఆయన పేర్కొన్నారు. “హిందువులకు ఏకైక దేశం భారతదేశమే” అని నొక్కి చెబుతూ, భారత ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకుని ఏదైనా చేయాల్సి ఉంటుందని భగవత్ సూచించారు.
కాగా, భారతదేశం ఒక “హిందూ దేశం” అని నొక్కి చెబుతూ, ఆ విధంగా చెప్పేందుకు ఎలాంటి రాజ్యాంగ ఆమోదం అవసరం లేదని, ఎందుకంటే అది ఒక “నిజం” అని మోహన్ భాగవత్ తేల్చి చెప్పారు. “భారతదేశంలో భారతీయ సంస్కృతిని గౌరవించేంత వరకు భారతదేశం హిందూ దేశంగానే ఉంది, ఉంటుంది” అని తెలిపారు. రాజ్యాంగ పీఠికలో ‘హిందూ రాష్ట్రం’ పదం లేనప్పటికీ, అది క్లుప్తంగా హిందుత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు. “ఒకవేళ పార్లమెంట్ ఎప్పుడైనా రాజ్యాంగాన్ని సవరించి ఆ పదాన్ని చేర్చాలని నిర్ణయించుకున్నా, వారు చేసినా చేయకపోయినా ఫర్వాలేదు. మాకు ఆ పదం గురించి పట్టింపు లేదు, ఎందుకంటే మేము హిందువులం. మన దేశం హిందూ దేశం. అదే నిజం,” అని ఆయన స్పష్టం చేశారు.
“సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది ఎప్పటి నుంచి జరుగుతోందో మనకు తెలియదు. మరి దానికి కూడా మనకు రాజ్యాంగ ఆమోదం అవసరమా? హిందుస్థాన్ ఒక హిందూ దేశం. భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే వారందరూ భారతీయ సంస్కృతిని గౌరవిస్తారు. హిందుస్థాన్ గడ్డపై భారతీయ పూర్వీకుల వైభవాన్ని విశ్వసించి, ఆదరించే ఒక్క వ్యక్తి బ్రతికి ఉన్నంత కాలం, భారతదేశం ఒక హిందూ దేశం. ఇదే సంఘ్ సిద్ధాంతం,” అని ఆయన చెప్పారు.
ఆర్ఎస్ఎస్ ముస్లిం వ్యతిరేకి కాదు
ఆర్ఎస్ఎస్ హిందువుల రక్షణ కోసం వాదిస్తుందని, వారు “కఠోర జాతీయవాదులు” అని, అయితే, ముస్లిం వ్యతిరేకులు కాదని ప్రజలు అర్థం చేసుకున్నారని భగవత్ తెలిపారు. “మేము ముస్లిం వ్యతిరేకులమనే భావన ఉంటే, నేను చెప్పినట్లుగా, ఆర్‌ఎస్‌ఎస్ పని పారదర్శకంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చి మీరే స్వయంగా చూడవచ్చు, అలాంటిది ఏదైనా జరుగుతున్నట్లు మీరు చూస్తే, అప్పుడు మీరు మీ అభిప్రాయాలను కొనసాగించండి, ఒకవేళ మీరు అలా చూడకపోతే, మీ అభిప్రాయాలను మార్చుకోండి” అని వివరించారు.
ఆర్‌ఎస్‌ఎస్ గురించి అర్థం చేసుకోవడానికి చాలా ఉందని చెబుతూ కానీ మీరు అర్థం చేసుకోవడానికి ఇష్టపడకపోతే, ఎవరూ మీ మనసును మార్చలేరని భాగవత్ స్పష్టం చేశారు. కానీ నేర్చుకోవడానికి ఇష్టపడని వారికి సహాయం చేయలేమని ఆయన చెప్పారు.
కాగా, `సహజీవనం’ సంబంధాలు బాధ్యత తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని అర్ధం అవుతుందని చెబుతూ “ఇది సరికాదు. కుటుంబం, వివాహం కేవలం శారీరక సంతృప్తికి ఒక సాధనం కాదు. అది సమాజంలో ఒక భాగం. ఒక వ్యక్తి సమాజంలో ఎలా జీవించాలో కుటుంబంలోనే నేర్చుకుంటాడు. కాబట్టి, ఇది మన దేశాన్ని, సమాజాన్ని, మత సంప్రదాయాలను పరిరక్షించడం గురించిన విషయం,” అని ఆయన తెలిపారు.

More Stories
తెలంగాణ రాజకీయాల్లో పోటీ కాంగ్రెస్ – బిజెపి మధ్యే
వందేభారత్ తొలి స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ఠాక్రేల నుండి ముంబై బిజెపి కైవసం.. పుణెలో పవార్లపై ఆధిపత్యం