ప్రస్తుతం సుమారు 80శాతం జనాభా తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని, ఇజ్రాయిల్ ఆంక్షలతో గాజాలో తీవ్రమైన పోషకాహార లోప సంక్షోభం పొంచి వుందని ఐక్యరాజ్యసమితి (యుఎన్) హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి 101,000 (లక్షమంది)కి పైగా పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మానవతాసాయంపై ఇజ్రాయిల్ ఆంక్షలతో గాజాలో పరిస్థితి మరింత దిగజారిందని ఆందోళన వ్యక్తం చేసింది.
”ఈ విపత్తును అంతం చేయడానికి పెద్ద ఎత్తున మానవతా సాయాన్ని అనుమతించాలి, మానవతా కార్మికులు తమ పనిని చేయడానికి అనుమతించాలి” అని యుఎన్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ ఇన్ ది నియర్ ఈస్ట్ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) కమిషనర్ జనరల్ ఫిలిప్ లాజారిని తెలిపారు. 2025 అక్టోబర్ నుండి కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ, మానవతా అవసరాలు ప్రస్తుత ప్రతిస్పందన సామర్థ్యాన్ని మించిపోయాయని పేర్కొన్నారు.
”సాయం చేరుకోవడం కంటే అవసరాలు వేగంగా పెరుగుతున్నాయి” అని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. ఇది ప్రస్తుత మానవతా సహాయం అసమర్థతను ఎత్తి చూపుతోందని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పంపిణీలో స్వల్ప మెరుగుదల ఉన్నప్పటికీ, నవంబర్‌లో 67శాతం గృహాలకు ఆహారం మరియు రొట్టెలు అందాయని, కేవలం ”ప్రాథమిక మనుగడ అవసరాలు” మాత్రమే తీర్చబడుతున్నాయని పేర్కొన్నారు.
గాజా జనాభాలో పావు వంతు అంటే ఐదు లక్షల మంది ప్రజలు కరువు పీడిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ క్లాసిఫికేషన్ (ఐపిసి) ఆగస్టులో వెల్లడించిన నివేదికలో పేర్కొంది. ఈ సంక్షోభానికి ఇజ్రాయిల్ మానవతా ఆంక్షలు, 7,30,000మందికి పైగా బలవంతంగా స్థానభ్రంశం చెందడం, 96 శాతం వ్యవసాయ భూమి నాశనం కావడం కారణమని స్పష్టం చేసింది.
ఇజ్రాయిల్ మానవతా సాయాన్ని అడ్డుకుంది, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంతృత్వ అధికార చర్యలతో పాటు వాణిజ్య, సహాయ ట్రక్కుల ప్రయాణంపై ఆంక్షలు కరువును శాశ్వతం చేశాయి. ఈ అడ్డంకులను తొలగించకపోతే గాజాలో పౌరుల కార్యకలాపాలు కూలిపోతాయని యుఎన్, ఎన్‌జిఒలు హెచ్చరిస్తున్నాయి.
2026 అక్టోబర్ నాటికి తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న 6 నెలల నుండి 5 ఏళ్లవయస్సు కలిగిన 101,000 మంది చిన్నారుల్లో, 31,000కంటే ఎక్కువమంది తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఐపిసి నివేదిక తెలిపింది. అదనంగా 37,000 మంది గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలకు తీవ్రమైన పోషకాహార లోపం కోసం చికిత్స అవసరమని పేర్కొంది. అన్ని గాజా గవర్నరేట్లలో 6 మరియు 23 నెలల మధ్య వయస్సు గల ఏ బిడ్డకి కూడా కనీస ఆహార వైవిధ్య అవసరాలను తీర్చడం లేదని తెలిపింది.
ఇటీవలి శీతాకాల తుఫానుల కారణంగా ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. తుఫానులో డిసెంబర్లో 55,000 నివాసాలను ముంచెత్తాయి. అత్యంత కనిష్ట ఉష్ణోగ్రల కారణంగా ముగ్గురు పిల్లలు మరణంచారని యుఎన్ ఆఫీసర్ ఫర్ ది కో-ఆర్డినేషన్ ఆఫ్ హ్యుమన్‌టేరియన్ అఫైర్స్ (ఒసిహెచ్ఎ) తెలిపింది. శాశ్వత కాల్పుల విరమణ కోసం, ఇజ్రాయిల్ వెంటనే ఆంక్షలను ఎత్తివేయాలని, మావనతా సాయానికి ఆటంకాలు లేకుండా సరఫరా అయ్యేందుకు అధికారిక అడ్డంకులను తొలగించాలని గుటెరస్ పునరుద్ఘాటించారు.

More Stories
‘బాబ్రీ మసీదు’ నమూనా నిర్మాణం వెనుక రాజకీయ కుట్ర
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో `మహాయుతి’ భారీ విజయం
మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిన మధ్య ప్రదేశ్