సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలను అమెరికా టార్గెట్ చేసింది. ఆ స్థావరాలపై అమెరికా సైన్యం వైమానిక దాడలు చేసింది. ఇటీవల అమెరికా సిబ్బందిపై సిరియా దాడి చేసిన నేపథ్యంలో ప్రతీకార దాడులకు పాల్పడినట్లు ఓ అధికారి తెలిపారు. అనుమానిత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిరియాలో ఉన్న అమెరికా సైనిక సిబ్బందిపై దాడి చేశారని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల వెల్లడించారు.
ఎఫ్15, ఎఫ్ 16, ఎ10 వంటి యుద్ధ విమానాలతో విధ్వంసం సృష్టించింది. ఈ దాడులను అమెరికా అధ్యక్షులు ట్రంప్ నిర్ధారించారు. ఇటీవల సిరియాలోని పామిరా నగరంలో ఇద్దరు అమెరికన్ సైనికులను ఐసిస్ హతమార్చింది. అనంతరం సిరియాలోని ఐసిస్ (ఐఎస్ఐఎస్) కు చెందిన 70కు పైగా కార్యాలయాలు, ఆయుధ డంప్‌లపై భారీ దాడులు చేసింది.
”సిరియాలో ధైర్యవంతులైన అమెరికన్ దేశభక్తులను ఐసిస్ దారుణంగా హత్య చేసినందున దానికి కారణమైన హంతక ఉగ్రవాదులపై నేను వాగ్దానం చేసినట్లుగానే అమెరికా చాలా తీవ్రమైన ప్రతీకారం తీర్చుకుంటుందని నేను ప్రకటిస్తు న్నాను’ అని ట్రంప్ శుక్రవారం తన ట్రూత్ సోషల్‌లో తెలిపారు. ఈ దాడులను సిరియా విదేశాంగ మంత్రిత్వశాఖ కూడా ధృవీక రించింది.
అంతకుముందు, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ‘ఐసిస్ మౌలిక సదుపాయాలు, ఆయుధ ప్రదేశాలను’ లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని ప్రకటించారు. ‘ఇది యుద్ధం కాదు – ఇది ప్రతీకారం’ అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. “మా శత్రువులను వేటాడామని, వాళ్లను చంపేశామని అన్నారు. ఈ దాడుల ప్రక్రియ కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.
సెంట్రల్ సిరియాలో ఉన్న ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన అనేక టార్గెట్లను ధ్వంసం చేసినట్లు ఇద్దరు అమెరికా అధికారులు పేర్కొన్నారు. సెంట్రల్ సిరియాలోని పల్మైరాలోఉన్న దళాలపై జరిపిన దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు, ఓ ఇంటర్ప్రిటర్ మరణించారు. అమెరికా దళాలకు చెందిన సుమారు వెయ్యి మంది సైనికులు ఇంకా సిరియాలోనే ఉన్నారు.
అయితే ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించుకుంది. దాని పేరుతో సిరియాలో అనేక సంవత్సరాల నుండి వేలాది మంది సైనికులను అమెరికా మోహరించింది. తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుని సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ అక్కడి చమురు, నిక్షేపాలపై ఆధిపత్యం చేస్తుందని పలువురు భావిస్తున్నారు.

More Stories
బంగ్లాదేశ్‌లో హిందూవును పోలీసుల సంరక్షణలోనే కొట్టి చంపారా?
ఐరాసలో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ధ్యానం
ఇమ్రాన్ దంపతులకు చెరో 17 ఏళ్ల జైలు శిక్ష