అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కాంగ్రెస్ ఎజెండాలో ఎప్పుడూ లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఈశాన్య భారతంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ చేసిన తప్పులను తాము సరిచేస్తున్నామని చెప్పారు. స్వాతంత్ర్యానికి ముందు గోపీనాథ్ బోర్డోలాయి అసోంను కాపాడారని, కానీ ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్ర, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాయని మోదీ ఆరోపించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మతపరమైన బుజ్జగింపులకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన దుయ్యబట్టారు.
బంగాల్, అసోంలో చొరబాటుదారులకు బహిరంగంగా అనుమతులు ఇచ్చిందని ఆయన విమర్శించారు. ఫలితంగా అడవులు, ప్రభుత్వ భూములు అక్రమణకు గురైనట్లు చెప్పారు. దీనివల్ల ఈ ప్రాంతాల జనాభా స్వరూపంతో పాటు అసోం రాష్ట్ర భద్రత, సాంస్కృతిక గుర్తింపు తీవ్ర ప్రమాదంలో పడిందని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధికి దూరం పెట్టడం వల్ల దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని మోదీ మండిపడ్డారు. దేశ ఐక్యత, భద్రత, సమగ్రత అన్నింటికీ తీవ్ర నష్టం జరిగిందని పేర్కొంటూ కాంగ్రెస్ పాలనలో దశాబ్దాల పాటు హింస రాజ్యమేలిందని విమర్శించారు. కేవలం 11 ఏళ్లలోనే ఆ పరిస్థితిని పూర్తిగా మార్చే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.
ఒకప్పుడు హింసతో అల్లాడిన ఈశాన్య ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి బాట పట్టాయని ప్రధాని చెప్పారు. గతంలో హింస ప్రభావిత జిల్లాలుగా పిలిచిన ప్రాంతాలు ఇప్పుడు ఆకాంక్షిత జిల్లాలుగా మారాయని తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అసోం అభివృద్ధి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంలాగా నిరంతరం కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. అ
సోం అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్న మోదీ ఎందరో ప్రముఖులు కన్న అభివృద్ధి కల బీజేపీ హయాంలో నేరవేరుతోందని వివరించారు. అసోం ప్రజల ఆప్యాయత, ప్రేమ తనను నిరంతరం ప్రేరేపిస్తాయని మోదీ తెలిపారు. ప్రజలు కలిగిస్తున్న ప్రేరణ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తాము తీసుకున్న సంకల్పాన్నిమరింత బల పరుస్తుందని పేర్కొన్నారు.
రెండు రోజుల పర్యటన కోసం అసోంలోని గువాహాటి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ లోకప్రియ గోపినాథ్ బోర్దోలోయీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 4వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ టెర్మినల్‌ను కేంద్రం నిర్మించింది. ఈశాన్య ప్రాంతాలకు విమానయాన కేంద్రంగా ఆగ్నేయ ఆసియాకు ప్రవేశ ద్వారంగా ఉండాలన్న లక్ష్యంతో దీన్ని తీర్చిదిద్దింది.
ఈ టెర్మినల్‌ను అసోం సంస్కృతి, జీవవైవిధ్యం ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. 14 ఎంట్రీ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన 140 మెట్రిక్ టన్నుల వెదురును ఉపయోగించి సిగ్నేచర్ వాల్ట్, ఇంటీరియర్లు డిజైన్లు చేశారు. దాదాపు 1 లక్ష స్థానిక మొక్కలతో ‘స్కై ఫారెస్ట్’ను సైతం నిర్మించారు. ఏటా కోటీ 30లక్షల మందికిపైగా ప్రయాణించే సామర్థ్యంతో టెర్మినల్‌ను అభివృద్ధి చేశారు. అసోం తొలి సీఎం గోపినాథ్ బోర్దోలోయీ పేరుతో ఉన్న గువాహాటీ విమానాశ్రయం వెలుపల 80 అడుగుల గోపినాథ్ విగ్రహాన్ని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

More Stories
బంగ్లాదేశ్‌లో హిందూవును పోలీసుల సంరక్షణలోనే కొట్టి చంపారా?
ఆత్మసాక్షాత్కారానికి ప్రాథమిక మార్గం క్రియాయోగం
ఐరాసలో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ధ్యానం