అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటికే ఇద్దరు నిందితులు మృతి చెందగా ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ పన్నెండేళ్లుగా బెయిల్‌పైనే ఉన్నారు. పారిశ్రామికవేత్తలకు అడ్డగోలుగా నీళ్లు, నిధులు, నిక్షేపాలు అప్పగించి ప్రతిఫలంగా కోట్ల రూపాయల ముడుపులను పెట్టుబడులుగా మలిచారని ఈ కేసుల్లో నిందితులపై తీవ్రమైన అభియోగాలున్నాయి.
సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీతో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ తాజాగా మళ్లీ మొదటి కొచ్చింది. కొంతకాలంగా రోజువారీ విచారణ చేపట్టి 4 ఛార్జిషీట్లలో డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయమూర్తి టి. రఘురాం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టి. పట్టాభిరామారావును నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ 11, ఈడీ 9 ఛార్జిషీట్లు వేశాయి. మొదటి అభియోగపత్రం 2012 మార్చి 31న, చివరి ఛార్జిషీట్ 2014లో దాఖలయ్యాయి. సీబీఐ కోర్టులో 2013 నుంచి దాఖలైన సుమారు 130 డిశ్చార్జి పిటిషన్లు ఇప్పటికీ తేలడం లేదు. డిశ్చార్జి పిటిషన్లపై తీర్పు వెల్లడైతేనే నిందితులపై అభియోగాలు నమోదు చేసి ట్రయల్ చేపట్టాల్సి ఉంటుంది.
డిశ్చార్జ్ పిటిషన్లు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటంతో కేసుల్లో నిందితులందరూ వాదనలు వినిపించిన తరువాతే వాదనలు వినిపిస్తామని సీబీఐ, అన్ని కేసుల్లోనూ నిందితులుగా ఉన్నందున తామూ ఒకేసారి వాదనలు వినిపిస్తామని జగన్, విజయసాయిరెడ్డి కోర్టులను ఆశ్రయించడంతో కొంతకాలంగా విచారణ ముందుకు సాగడంలేదు.
తర్వాత రోజువారీ విచారణ జరుగుతున్నప్పటికీ అన్ని డిశ్చార్జ్ పిటిషన్లపై ఒకేసారి తీర్పు వెల్లడించాల్సి ఉన్నందున సుదీర్ఘ వాదనలు కొంత వినగానే జడ్జీలు బదిలీ కావడంతో మళ్లీ మొదటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇలా పన్నెండేళ్లలో 8 మంది జడ్జిలు బదిలీ అయ్యారు. నిందితులుగా ఉన్న సజ్జల దివాకర్‌రెడ్డి, అరబిందోకు చెందిన పీఎస్ చంద్రమౌళి ఇప్పటికే మృతి చెందారు.
ఈ కేసుల్లో జగన్, విజయసాయిరెడ్డి, అరెస్టైన ఇతర నిందితులు షరతులతో కూడిన బెయిలుపై ఉన్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ బెయిలు పొంది పన్నెండేళ్లయింది. సీబీఐతో పాటు ఈడీ అభియోగ పత్రాల్లోనూ జాప్యం జరుగుతోంది. భారతీ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ ఇంకా అభియోగపత్రాలే దాఖలు చేయలేదు.

More Stories
శ్రీశైలంలో పెరిగిన స్పర్శ దర్శనం వేళలు
గౌహతిలో శ్రీవారి ఆలయంకు 25 ఎకరాల భూమి కేటాయింపు
ఏపీకి ఆర్ధిక వత్తిడిల నుండి ఆదుకోమని కోరిన చంద్రబాబు