గగన్‌యాన్‌ మిషన్‌ దిశగా డ్రోగూ పారాచూట్‌ పరీక్షలు

గగన్‌యాన్‌ మిషన్‌ దిశగా డ్రోగూ పారాచూట్‌ పరీక్షలు
 
* 24న శ్రీహరికోట నుంచి అమెరికా భారీ శాటిలైట్‌ ప్రయోగం
 
గగన్‌యాన్‌ మిషన్‌కు ఉపయోగించే డ్రోగూ పారాచూట్‌ విస్తరణ పరీక్షలు విజయవంతమయ్యాయని ఇస్రో శనివారం ప్రకటించింది. గగన్‌యాన్‌ సిబ్బంది ప్రయాణించే మాడ్యూల్‌కు వేగాన్ని తగ్గించే వ్యవస్థను అభివృద్ధిపరచడం కోసం డ్రోగూ పారాచూట్‌లకు వరుసగా క్వాలిఫికేషన్‌ పరీక్షలు నిర్వహించారు. అవన్నీ కూడా విజయవంతంగా పూర్తయ్యాయని ఇస్రో వెల్లడించింది. 
 
చండీఘడ్‌లోని టెర్మినల్‌ బాలిస్టిక్‌ రీసెర్చ్‌ లేబరేటరీ (టిబిఆర్‌ఎల్‌)లో ఈ నెల 18, 19 తేదీల్లో రైల్‌ ట్రాక్‌ రాకెట్‌ స్లెడ్‌ (ఆర్‌టిఆర్‌ఎస్‌) కేంద్రంలో ఈ పరీక్షలన్నీ పూర్తి చేసినట్లు తెలిపింది. వేగాన్ని తగ్గించే వ్యవస్థలో నాలుగు తరహాలకు చెందిన మొత్తం పది పారాచూట్లు వుంటాయని తెలిపింది. అపెక్స్‌ కవర్‌ సెపరేషన్‌ పారాచూట్స్‌తో వేగం తగ్గింపు ప్రక్రియ మొదలవుతుంది. పారాచూట్‌ కంపార్ట్‌మెంట్‌కు రక్షణగా వుండే కవర్‌ను తొలుత తొలగిస్తారు.
 
ఆ తర్వాత రెండు డ్రోగూ పారాచూట్‌లు విస్తరిస్తూ మాడ్యూల్‌ వేగాన్ని తగ్గించి, సుస్థిరంగా నిలుపుతాయని ఇస్రో ప్రకటన పేర్కొంది. ఈ మొత్తం వ్యవస్థలో కీలకమైన అంశం డ్రోగూ పారాచూట్‌లు విస్తరించడమని తెలిపింది. దీంతో, మానవ రోదసీ ప్రయాణానికి అర్హమైన పారాచూట్‌ వ్యవస్థ దిశగా గణనీయమైన అడుగు పడిందని ఆ ప్రకటన పేర్కొంది.
 
మరోవంక, భారత అంతరిక్ష చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీహరికోట నుంచి అమెరికా భారీ శాటిలైట్‌ ప్రయోగం డిసెంబర్‌ 24 న బుధవారం ఉదయం 8.54 గంటలకు జరగనుంది. దేశ శాస్త్రీయ సామర్థ్యాన్ని ప్రపంచానికి ఘనంగా చాటే ఈ చారిత్రక అంతర్జాతీయ ప్రయోగం జరగనుండగా శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. 
 
భారత ప్రభుత్వ రంగ సంస్థ న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ బాధ్యతగా నిర్వహిస్తున్న ఈ మిషన్‌ ద్వారా అమెరికాకు చెందిన భారీ వాణిజ్య శాటిలైట్‌ బ్లూ బర్డ్‌ బ్లాక్‌ 2 ను భూమి చుట్టూ నిరంతరం పరిభ్రమించే కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టనున్నారు.  భారతదేశంలో అత్యంత శక్తివంతమైన గగన్‌ యాన్‌ శ్రేణికి చెందిన ఎల్‌ బి ఎం 3 రాకెట్‌ ద్వారా నిర్వహించనున్న ఈ ప్రయోగాన్ని ఎల్విఎం 3 ఎం 6 మిషన్‌ గా పిలుస్తున్నారు. 
 
రెండో ప్రయోగం వేదిక నుంచి చేపట్టనున్న ఈ మిషన్‌ లో ప్రయోగించబడే శాటిలైట్‌ బరువు సుమారు 6,500 కిలోలు.  ప్రపంచ వ్యాప్తంగా సాధారణ స్మార్ట్‌ ఫోన్‌ లకు నేరుగా హై స్పీడ్‌ సెల్యూలర్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శాటిలైట్‌ ను రూపొందించారు. దాదాపు 2400 చదరపు అడుగుల విస్తీర్ణం గల అత్యాధునిక కమ్యూనికేషన్‌ అరేలు ఇందులో ఉండటం విశేషం.ఎర్త్‌ ఆర్బిట్‌ లో ఇప్పటివరకు ప్రయోగించిన వాణిజ్య శాటిలైట్‌ లలో ఇదే అతి పెద్ద ప్రయోగంగా నిలవనుంది. 
 
ప్రతి కవరేజ్‌ ప్రాంతంలో గరిష్టంగా 120 వేగం అందించే సామర్థ్యం ఈ శాటిలైట్‌ కు ఉంది. ఒకప్పుడు ఇతర దేశాల సహకారం పై ఆధారపడిన భారత అంతరిక్ష కార్యక్రమం నేడు అమెరికా వంటి అగ్రశ్రేణి దేశాల శాటిలైట్లను స్వదేశీ రాకెట్‌ ద్వారా ప్రయోగించే స్థాయికి ఎదగడం దేశ శాస్త్రీయ శక్తికి స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోంది. ఈ మిషన్‌ ద్వారా అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష రంగంలో భారత్‌ విశ్వసనీయత మరింత పెరిగి ప్రపంచంలో భారత స్థానం మరింత బలపడనుంది.