తోషఖానా-2 అవినీతి కేసులో పాకిస్థాన్ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌ఐఏ)కు చెందిన ప్రత్యేక కోర్టు శనివారం మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీలకు చెరో 17 ఏళ్ల జైలుశిక్షను విధించింది. 2021 మే నెలలో పాకిస్థాన్ పర్యటన సందర్భంగా నాటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ బుల్గారీకి చెందిన బంగారు ఆభరణాల సెట్‌ను బహూకరించారు.
ఈవిధంగా ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులకు అందే గిఫ్టులు పాకిస్థాన్ ప్రభుత్వ తోషాఖానా విభాగానికి చేరుతాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ ఆభరణాల సెట్‌ను తక్కువ ధరకే తోషాఖానా నుంచి కొనేశారనే అభియోగంతో 2024 జులైలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. తోషాఖానా నుంచి విలువైన చేతి గడియారాలు, వజ్ర ఆభరణాలు, బంగారు ఆభరణాలను కారు చౌకగా ఇమ్రాన్ ఖాన్ దంపతులు దక్కించుకున్నారనే అభియోగాలను మోపారు.
ఇదే తోషఖానా-2 అవినీతి కేసు. ఇందులో ఇమ్రాన్, బుష్రా బీబీ దోషులు అని తేలడంతో ప్రత్యేక ఎఫ్ఐఏ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ షారుఖ్ ఆర్జూమంద్ తాజా తీర్పును ఇచ్చారు. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని ఇమ్రాన్ ఖాన్ దంపతుల తరఫు న్యాయవాదులు ప్రకటించారు. రావల్పిండి నగరంలోని అడియాలా జైలులోనే తోషఖానా-2 అవినీతి కేసుకు సంబంధించిన వాదోపవాదనలన్నీ జరిగాయి.
శనివారం ఉదయం అడియాలా జైలులో ప్రత్యేక కోర్టు జడ్జి ఎదుట ఇమ్రాన్, బుష్రా బీబీలను హాజరుపరిచారు. వారి ఎదుటే న్యాయమూర్తి తీర్పును చదివి వినిపించారు. వారిద్దరికి చెరో 17 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.1.64 కోట్లు చొప్పున జరిమానాను కూడా జడ్జి షారుఖ్ ఆర్జూమంద్ విధించారు. ప్రధానమంత్రి హోదాలో పాకిస్థాన్‌తో నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడినందుకు పదేళ్ల కఠిన కారాగార శిక్షను, అధికారాన్ని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడినందుకు మరో ఏడేళ్లను శిక్షను విధిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.
ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు 73 ఏళ్ల వయసులో ఉన్నందున, బుష్రా బీబీ మహిళ అయినందుకు దయాభావంతో వీలైనంత తక్కువ శిక్షనే విధించామని జడ్జి షారుఖ్ ఆర్జూమంద్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి తోషఖానా-2 కేసులో 2024 అక్టోబరులో బుష్రా బీబీకి ఇస్లామాబాద్ హైకోర్టు బెయిలును మంజూరు చేసింది. ఈ కేసులోనే కొన్ని నెలల తర్వాత ఇమ్రాన్‌కు కూడా బెయిలు వచ్చింది. కానీ 2024 డిసెంబరులో ఈ కేసులో నేర దర్యాప్తునకు కోర్టు ఆదేశాలు జారీ అయ్యాయి.
పలు ఇతరత్రా కేసుల్లోనూ నిందితులుగా ఉండటంతో ఇమ్రాన్ ఖాన్ దంపతులు రావల్పిండి నగరంలోని అడియాలా జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో జైలులోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి, అక్కడే న్యాయవిచారణ జరిపించారు. ఈక్రమంలో అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో 2025 సంవత్సరం జనవరి 17న మరో కోర్టు ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. ఇమ్రాన్, బుష్రా బీబీ దోషులు అని తేల్చింది. ఇమ్రాన్‌కు 14 ఏళ్లు, బుష్రాకు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. ఇక ఈ ఏడాది(2025) అక్టోబరులో ప్రత్యేక కోర్టులో తోషఖానా-2 కేసుపై న్యాయ విచారణ జరిగింది.
తమపై చేసిన అన్ని అభియోగాలను ఇమ్రాన్ ఖాన్ దంపతులు ఖండించారు. రాజకీయ దురుద్దేశంతో తమపై ఆ కేసులు పెట్టారని తెలిపారు. పాకిస్థాన్ రాజకీయాల నుంచి తమను దూరం చేసేందుకే ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు. తోషాఖానా పాలసీ-2018 ప్రకారమే తాను నిర్ణయాలను తీసుకున్నానని ఇమ్రాన్ తెలిపారు. పాకిస్థాన్ ఖజానాకు నిర్దిష్ట నగదును చెల్లించిన తర్వాతే ఆ గిఫ్టులను తాను తీసుకున్నానని ఆయన చెప్పారు.

More Stories
బీజేపీలో చేరిన సినీ నటి ఆమని
టీఎంసీ పరిరక్షణలోనేఅక్రమ చొరబాటుదారులు
బిజెపికి గాంధీ స్ఫూర్తి, ఆయన `పంచ నిష్ఠ’ సూత్రాలతో విశ్వాసం