ఏపీకి ఆర్ధిక వత్తిడిల నుండి ఆదుకోమని కోరిన చంద్రబాబు

ఏపీకి ఆర్ధిక వత్తిడిల నుండి ఆదుకోమని కోరిన చంద్రబాబు
తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్న ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి బాటలో పయనించేందుకు భారీ ఎత్తున నిధులివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కేంద్రాన్ని అభ్యర్థించారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. కీలక ప్రాజెక్టులకు నిధుల మంజూరు కోరారు.  జగన్‌ విధ్వంసక పాలనతో కుదేలైన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు.


రాష్ట్రం ‘పూర్వోదయ’ గ్రోత్‌ ఇంజన్‌గా మారుతుందని నిర్మలా సీతారామన్‌తో సీఎం పేర్కొన్నారు. ‘విద్య, నైపుణ్యకల్పన, వ్యవసాయం, ఎంఎ్‌సఎంఈ, హౌసింగ్‌, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులకు పూర్వోదయ నిధులు అందించాలి. ఈ పథకం కింద ప్రాధాన్య క్రమంలో చేపట్టే ప్రాజెక్టులకు పాలనాపరమైన నిబంధనలను సరళీకృతం చేయాలి. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా దీని నిధులను వినియోగించుకునే వెసులుబాటు ఇవ్వాలి’ అని కోరారు.

 
సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని, విశాఖలో యూనిటీ మాల్‌ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్‌లాక్‌ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో మూడు వర్కింగ్‌ వుమెన్‌ హాస్టళ్ల నిర్మాణాల పూర్తికి నిధులివ్వాలని ముఖ్యమంత్రి కోరారు. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర, జిల్లా రహదారుల నిర్మాణం, ఎంఎ్‌సఎంఈ పార్కులు, హౌసింగ్‌, వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. 
 
ఈ పనుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10,054 కోట్లు మంజూరు చేయమనని విజ్ఞప్తి చేశారు. రాయలసీమలో ఉద్యానవన అభివృద్ధి ప్యాకేజీకి ఆర్థిక సాయం కోరుతూ నిర్మలకు చంద్రబాబు వినతిపత్రం అందజేశారు. ‘ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న 18 పంటలను సాగు చేస్తున్నాం. సీమ జిల్లాల్లో విస్తరించిన 93 ఉద్యానవన క్లస్టర్లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 33.7 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతోంది’ అని చెప్పారు.

శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీఎం సమావేశమై 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్‌ జీవన్‌ మిషన్‌ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని విన్నవించారు. రాష్ట్రప్రభుత్వ వాటాగా రూ.524.41 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దుగరాజపట్నాన్ని నేషనల్‌ మెగా షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌గా త్వరితగతిన ఆమోదించాలని కేంద్ర షిప్పింగ్‌ మంత్రి సోనోవాల్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. నేషనల్‌ మెగా షిప్‌బిల్డింగ్‌, షిప్‌ రిపేర్‌ క్లస్టర్‌ అభివృద్థికి పూర్తిగా సహకరించాలని కోరారు.