రూ. 4వేల కోట్ల బకాయిలతో కర్ణాటక ఆర్టీసీ దివాలా!

రూ. 4వేల కోట్ల బకాయిలతో కర్ణాటక ఆర్టీసీ దివాలా!
అధికారంలోకి రావడమే లక్ష్యంగా కర్ణాటకలోని కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన 5 గ్యారెంటీలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమాగంగా తయారైంది. ఐదు గ్యారెంటీల్లో భాగంగా తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం (శక్తి స్కీమ్‌) ఆర్టీసీ సంస్థకు గుదిబండగా మారింది.  2023లో ప్రారంభించిన శక్తి స్కీమ్‌ కింద మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ, ఆర్టీసీకి చెల్లించాల్సిన సుమారు రూ. 4,006.47 కోట్ల బకాయిలను మాత్రం సిద్ధరామయ్య ప్రభుత్వం అటకెక్కించింది. 
ఈ మేరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని బట్టి అర్థమవుతున్నది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో కర్ణాటక స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (కేఎస్‌ఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (బీఎంటీసీ), నార్త్‌ వెస్టర్న్‌ కర్ణాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌డబ్ల్యూకేఆర్టీసీ), కళ్యాణ కర్ణాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (కేకేఆర్టీసీ) దివాలా అంచుకు చేరాయి. 

ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో తాము బస్సులను నడుపలేని పరిస్థితికి వచ్చామని, సిబ్బందికి కూడా వేతనాలు ఇవ్వడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఆర్టీసీ ఉన్నతాధికారి వాపోయాడు. ప్రభుత్వ తీరుపై విపక్ష నేతలు మండిపడ్డారు. అలవిగాని హామీలతో ఆర్టీసీని ప్రభుత్వం కుదేలు చేస్తున్నదని ధ్వజమెత్తారు.

శక్తి స్కీమ్‌ ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నామంటూ ఒకవైపు ప్రభుత్వం ప్రచారం చేసుకొంటున్నప్పటికీ, ఈ ఫ్రీ స్కీమ్‌ కారణంగా టికెట్‌ ధరలను పెంచారంటూ పురుషులు మండిపడుతున్నారు. బస్సు సర్వీసులను కూడా గణనీయంగా తగ్గించారంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 కాగా, రాష్ట్రంలోని 1,800 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. శక్తి పథకం వినియోగించుకోవాలంటే మహిళలు కనీసం 2 కిలోమీటర్లు నడిచి దగ్గర్లోని మండల బస్టాప్‌లకు రావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ మేరకు ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రవాణా మంత్రి రామలింగారెడ్డి సమాధానం ఇచ్చారు. దీంతో శక్తి స్కీమ్‌ పూర్తిస్థాయిలో అమలు కావడంలేదని. ఇదో విఫల పథకమని విపక్షాలు మండిపడుతున్నాయి.