సిడ్నీ పేలుడుకు తెలంగాణతో సంబంధం లేదు

సిడ్నీ పేలుడుకు తెలంగాణతో సంబంధం లేదు

ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కీలక స్పష్టత ఇచ్చారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ మూలాలు ఉన్నప్పటికీ, ఈ ఘటనకు హైదరాబాద్ లేదా తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ అంశంపై అనవసర అపోహలు సృష్టించవద్దని ఆయన సూచించారు.

డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం, పాతబస్తీ ప్రాంతానికి చెందిన సాజిద్ అక్రమ్ 1998లో ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడే స్థిరపడిన అతడు యూరోపియన్ వంశానికి చెందిన వెనెరా గ్రాసో అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత జీవితాన్ని పూర్తిగా ఆస్ట్రేలియాలోనే కొనసాగించాడు.

సాజిద్ అక్రమ్ ఆరుసార్లు భారత్‌కు వచ్చినట్లు రికార్డులు ఉన్నాయని డీజీపీ వెల్లడించారు. 1998లో భార్యతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన సాజిద్, అనంతరం 2004, 2009, 2011, 2016లో భారత్‌ను సందర్శించాడు. 2016లో ఆస్తి సంబంధిత వ్యవహారాల కోసం వచ్చాడని, 2022లో చివరిసారిగా తన తల్లి, సోదరిని కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిపారు.

కాగా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధం ఉన్న తండ్రీకొడుకులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్.. యూదులంతా బాండీ బీచ్‌‪లో హునెక్కా పండుగ చేసుకుంటుండగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 16 మంది మృతిచెందగా, 36 మంది గాయపడ్డారు. 

పోలీసుల కాల్పుల్లో సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే మృతిచెందగా, అతని కుమారుడు నవీద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు నవీద్‌పై న్యూ సౌత్‌వేల్స్‌ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు నమోదు చేశారు. వాటిలో 15 హత్యలు, ఓ ఉగ్రవాద చర్యకు సంబంధించిన కేసులు ఉన్నాయి.