ఆర్మీ అకాడ‌మీలో చ‌రిత్ర సృష్టించిన 23 ఏళ్ల మ‌హిళా ఆఫీస‌ర్‌

ఆర్మీ అకాడ‌మీలో చ‌రిత్ర సృష్టించిన 23 ఏళ్ల మ‌హిళా ఆఫీస‌ర్‌
భార‌త సైనిక అకాడ‌మీలో 23 ఏళ్ల మ‌హిళా ఆఫీస‌ర్ సాయి జాద‌వ్ చ‌రిత్ర సృష్టించింది. ఐఎంఏ నుంచి పాసౌట్ అయిన తొలి మ‌హిళా టెరిటోరియ‌ల్ ఆఫీస‌ర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. 157వ కోర్సుకు చెందిన పాసింగ్ ఔట్ ప‌రేడ్‌ను గ‌త వారం నిర్వ‌హించారు. ఆ ఈవెంట్‌లో సాయీ జాద‌వ్‌కు లెఫ్టినెంట్ హోదాను క‌ల్పిస్తూ క‌మీష‌న్ చేశారు. 
సాయీ జాద‌వ్‌ది మ‌హారాష్ట్ర‌లోని కోల్హాపూర్‌. అయితే 93 ఏళ్ల అకాడ‌మీ చ‌రిత్ర‌లో ఓ మ‌హిళ టెరిటోరియ‌ల్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా పాస‌వుట్ కావ‌డం ఇదే మొద‌టిసారి. 
మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఈ సంద‌ర్భంగా ఆ ఆఫీస‌ర్‌కు అభినందనలు తెలిపారు. ఆమె సాధించిన ఘ‌న‌త అంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయ‌మైంద‌ని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అసంఖ్యాకంగా ఉన్న మ‌హిళ‌ల‌కు ఆమె ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు.  ఐఎంఏను 1932లో స్థాపించారు. ఆ అకాడ‌మీకి 93 ఏళ్ల చ‌రిత్ర ఉన్న‌ది. ఎంతో మంది మేటి ఆర్మీ ఆఫీస‌ర్ల‌ను ఆ అకాడ‌మీ త‌యారు చేసింది. అయితే ఆ అకాడ‌మీ నుంచి ఓ మ‌హిళా ఆఫీస‌ర్ టాప్‌లో నిల‌వ‌డం ఇదే తొలిసారి. 
  డిసెంబ‌ర్ 13వ తేదీన జ‌రిగిన సెర్మనీలో సాయీ జాద‌వ్‌ను క‌మిష‌న్ చేశారు.  ఉత్త‌రాఖండ్‌లోని పిత్తోర్‌ఘ‌ర్ ఏరియాలో ఉన్న కుమాన్ రెజిమెంట్‌కు చెందిన 130 టెరిటోరియ‌ల్ ఆర్మీ బెటాలియ‌న్‌లో త‌న కూతుర్ని క‌మిష‌న్ చేసిన‌ట్లు తండ్రి మేజ‌ర్ సందీప్ జాద‌వ్ తెలిపారు. అయితే త‌న కూతురు సాయీ జాద‌వ్‌ దూర‌విద్య ద్వారా ఎంబీఏ చ‌దువుతున్న‌ట్లు చెప్పారు.  ఎంబీఏ చ‌దువుతూనే త‌న కుమార్తె పోటీప‌రీక్ష‌ల‌కు, టెరిటోరియ‌ల్ ఆర్మీకి ప్రిపేరైన‌ట్లు ఆయ‌న తెలిపారు. 
 
డిసెంబ‌ర్ 2023లో ఆమె ఆ ప‌రీక్ష రాసింద‌ని చెప్పారు. టెరిటోరియ‌ల్ ఆర్మీలో మ‌హిళా ఆఫీస‌ర్‌కు ఒకే ఖాళీ ఉంద‌ని, అయితే మెరిట్ జాబితాలో ఆమె టాప్ ర్యాంక్‌లో ఉన్న‌ట్లు మేజ‌ర్ జాద‌వ్ చెప్పారు. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి చెందిన త‌న కూతురు దేశ సేవ‌లో పాల్గొన‌డం త‌మ‌కు గ‌ర్వంగా ఉంద‌ని మేజ‌ర్ జాద‌వ్ చెప్పారు. 
 
సీఎం ఫ‌డ్న‌వీస్ త‌న ట్వీట్‌లో మ‌రాఠీ ముల్గీ సాయీ అని కీర్తించారు. 93 ఏళ్ల ఏఎంఏ చ‌రిత్ర‌లో సాయీ తొలి మ‌హిళా ఆఫీస‌ర్‌గా రికార్డు క్రియేట్ చేయ‌డం గ‌ర్వంగా ఉంద‌ని రాశారు. కోల్హాపూర్‌లో పుట్టినా, ఆమె త‌న విద్యాభ్యాసాన్ని బెల్గామ్‌లో చేసింది. జాద‌వ్ కుటుంబం ఎన్నేళ్లుగానో సైనిక సేవ‌లో పాల్గొన్న‌ది. సాయీ జాద‌వ్ నాలుగో త‌రానికి చెందిన సైనిక సేవ‌కురాలు అయ్యింది.