ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. 40 విమానాలు, 20కిపైగా రైళ్లు ఆలస్యం

ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. 40 విమానాలు, 20కిపైగా రైళ్లు ఆలస్యం
* రాజధానిలో వాహనాల ప్రవేశంపై, పెట్రోల్ పోయడంపై ఆంక్షలు
 

కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఎదురుగా ఉన్నవారు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి కూడా బయటకు రాలేకపోతున్నారు. మంచు దుప్పటి కప్పేయడంతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడింది.  ఇందిరాగాంధీ విమానాశ్రయంలో సుమారు 40 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదేవిధంగా 22కు పైగా రైళ్లు ఆలస్యమయ్యాయి.

ఫ్లైట్‌ ఆపరేషన్స్‌ ప్రస్తుతం సీఏటీ 3 కండీషన్స్‌లో ఉన్నాయని, ఈ నేపథ్యంలో విమాన రాకపోకపోకలు ఆలస్యమవడం లేదా రద్దవడం వంటివి జరగవచ్చని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.  ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు తాము వెళ్లాల్సిన విమానాల సమయాలను గురించి ఎప్పటికప్పుడు సంబంధిత ఎయిర్‌లైన్స్‌తో కాంటాక్ట్‌లో ఉండాలని సూచించారు. ఇక రాజధానిలో చాలా ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గిపోవడంతో రహదారుల వెంబడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. 
 
ఢిల్లీని ఎన్‌సీఆర్‌ పరిధిలోని ప్రాంతాలతో కలిపి హైవేలపై కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. కాగా, కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రూప్‌ IV కింద అత్యంత కఠినమైన కాలుష్య నియంత్రణలు అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఒకటి నుంచి ఐదో తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలినవారికి హైబ్రీడ్‌ మోడ్‌లో క్లాసుల జరుగనున్నాయి.

గురువారం నుంచి కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం(పీయూసీ) లేని వాహనాలకు డిల్లీ పెట్రోల్‌ స్టేషన్లలో ఇంధనం అందించరు. అంతేకాకుండా డిల్లీ బయట రిజిస్టరైన బీఎస్‌-4 ప్రమాణాలు పాటించని ప్రైవేటు వాహనాలకు రాజధానిలోకి ప్రవేశం ఉండదు. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు డిల్లీ సరిహద్దుల వద్ద పోలీస్‌, రవాణా శాఖ బృందాలను మెహరించారు.

ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ కెమెరాలు, పెట్రోల్ బంక్​ల వద్ద వాయిస్ అలర్ట్, పోలీసులు సాయంతో అమలు చేస్తున్నారు. ​అందుకోసం సరిహద్దులతో సహా చెక్​పాయింట్ల వద్ద 580 మంది పోలీసులను మోహరించారు. బీఎస్​-4 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే దిల్ లోకి అనుమతిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు.  బీఎస్​-4, బీఎస్​-3 లేదా అంతకంటే పాత ఉద్గార ప్రమాణాలు కలిగిన వాహనాలకు ప్రవేశం నిషేధమని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు.

ఈ నిబంధన వల్ల సుమారు 12 లక్షల వాహనాలు ప్రభావితమవుతాయని అంచనా. ఢిల్లీ రోజూ ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత అవసరాల కోసం వచ్చే వాహనాలు ఎక్కువగా ఉన్నాయి.  ఈ నిర్ణయాలు సాధారణ ప్రజలతో పాటు క్యాబ్ డ్రైవర్ల జీవనోపాధిపై కూడా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ప్రతిరోజూ లక్షలాది క్యాబ్‌లు డిల్లీ-ఎన్‌సీఆర్‌లో తిరుగుతుంటాయి. వాటిలో చాలా వాహనాలు బీఎస్​-4 ప్రమాణాలు కలిగివుండవు. వేలాది డ్రైవర్లు ఈ వాహనాలపై ఆధారపడి జీవిస్తున్నారు

ఢిల్లీలో గాలి నాణ్యత మళ్లీ పడిపోయింది. గురువారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 370 పాయింట్లు నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకటించింది. అటు ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో కూడా దట్టమైన పొగమంచు ఉంది.  ఇప్పటికే డిల్లీలో జీఆర్​ఏపీ-4ను అమలు చేసింది. కాలుష్య నియంత్రణకు సంబంధించిన జీఆర్‌ఏపీ-3, జీఆర్‌ఏపీ-4 నిబంధనల కారణంగా ఉపాధి కోల్పోయినవారికి నష్టపరిహారంగా రూ.10 వేలు చెల్లిస్తామని కూడా తెలిపింది. దిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలు గరిష్ఠంగా 50 శాతం ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలని పేర్కొంది.