వ్యవస్థీకృతమైన, వృత్తిరీత్యా, కరడుగట్టిన నేరస్తులతో సంబంధమున్న, కేంద్ర చట్టాల కింద విచారించేన కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులను ఢిల్లీలో ఎన్‌ఐఎ కేసులను విచారించే ప్రత్యేక కోర్టులకు బదిలీ చేయవచ్చని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాల్యా బాగ్చిలతో కూడిన బెంచ్ సూచించింది.
దేశ సార్వభౌమాధికారం, భద్రత, సమగ్రతలను ప్రభావితం చేసే నేరాల దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌లను రాష్ట్రాల నుంచి ఎన్‌ఐఎ స్వాధీనం చేసుకోవచ్చని జస్టిస్ బాగ్చి తెలిపారు. ఎన్‌ఐఎ చట్టం, 2008లోని సెక్షన్ 6 కింద ఎన్‌ఐఎకు ఆ అధికారం వుందన్నారు. ఇటువంటి కేసులు వివిధ రాష్ట్రాల్లోని పలు కోర్టుల్లో విచారణలో వున్నాయని, వాటిని ఒక గొడుగు కిందకు తీసుకురావాల్సి వుందని సుప్రీం పేర్కొంది.
ఒక రాష్ట్రంలో జరిగిన నేరం తాలుకూ పర్యవసానాలు మరో రాష్ట్రంలో వుండవచ్చని, అప్పుడు ప్రాదేశిక పరిధి సమస్య తలెత్తవచ్చని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. క్రిమినల్ విచారణ ఆలస్యం కావడానికి ఇది కూడా ఒక అంశమవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల క్రిమినల్‌కు లబ్ధి కలుగుతుందని, కానీ ఇది దేశ, సమాజ భద్రతా ప్రయోజనాలకు ఏ మాత్రమూ శ్రేయస్కరం కాదని సిజెఐ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతమున్న చట్ట వ్యవస్థను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకునే రీతిలో కేంద్రం చట్టాలను రూపొందించి, దీనిపై పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. వివిధ రాష్ట్రాల్లో అనేక ఎఫ్‌ఐఆర్‌లు వుంటాయి, వాటన్నింటినీ ఎన్‌ఐఎ తన ఆధీనంలోకి తీసుకోవచ్చని తెలిపారు.
ఇటువంటి కరడుగట్టిన నేరస్తుల కేసులన్నింటినీ ఒకే వ్యవస్ధ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే సంస్థ దర్యాప్తు చేయడం, ఒక ప్రత్యేక కోర్టు విచారించడం వల్ల పరస్పర విరుద్ధమైన తీర్పులను నివారించవచ్చని సుప్రీం పేర్కొంది. పైగా సాక్ష్యాధారాలను కాపాడుకోవడంలో కూడా సాయపడుతుందని తెలిపింది. ప్రత్యేక ఎన్‌ఐఎ కోర్టులను తగినన్ని నెలకొల్పే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.

More Stories
ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి
బోండీ బీచ్ లో కాల్పుల దర్యాప్తులో భారత బృందం
ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. 40 విమానాలు, 20కిపైగా రైళ్లు ఆలస్యం