దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాతావరణ కాలుష్యం కొనసాగుతున్నది. కాలుష్యానికి తోడు విపరీతంగా పొగమంచు కమ్మేసింది. దాంతో జనం ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కాలుష్యంతో కారణంగా పలువురు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ లెవెల్స్ 500గా నమోదైంది. తీవ్ర వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో కాలుష్య కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 అమలులోకి తీసుకువచ్చారు.
ఈ క్రమంలో ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా మంగళవారం మాట్లాడుతూ తొమ్మిది నుంచి పది నెలల్లో కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలించడం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమని పని అంగీకరించారు. ఈ విషయంలో ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పారు.
ఆప్ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రోజువారీ గాలి నాణ్యత సూచీ తగ్గించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తామని హామీ హామీ ఇచ్చారు. డిసెంబర్ 18 నుంచి రాజధానిలో పీయూసీ సర్టిఫికెట్ లేకుండా ఏ వాహనానికి కూడా పెట్రోల్, డీజిల్ పోయరని ఆయన స్పష్టం చేశారు. వాహన డ్రైవర్లు తప్పనిసరిగా పీయూసీ చేయించుకోవడానికి రెండు రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. గురువారం నుంచి ఈ నిబంధనలను అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.
సంబంధిత వాహనాన్ని సీజ్ చేసి, భారీ జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. బీఎస్-6 కంటే తక్కువ ప్రమాణాలు ఉండే ఢిల్లీయేతర ప్రైవేట్ వాహనాలను రాజధానిలోకి అనుమతించబోమని మంజీందర్ సింగ్ స్పష్టం చేశారు. శీతాకాలంలో కాలుష్య స్థాయిలు దశాబ్దకాలంలో చాలావరకూ ఒకే విధంగా ఉన్నాయని తెలిపారు.
నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని కూడా హెచ్చరించింది. అంతేకాదు, కాలుష్య నిరోధక ఆంక్షల కారణంగా పని కోల్పోయిన రిజిస్టర్డ్ నిర్మాణ కార్మికులకు రూ. 10,000 పరిహారం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఢిల్లీలో గాలి నాణ్యతలు నిన్నటి కంటే ఈరోజు (బుధవారం)కి కొంత మెరుగుపడ్డాయి. అయినప్పటికీ గాలి నాణ్యతలు వెరీ పూర్ కేటగిరిలోనే కొనసాగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. బుధవారం ఉదయం 9 గంటల సమయానికి ఢిల్లీలో 328 వద్ద ఎక్యూఐ స్థాయిలు నమోదయ్యాయి. మంగళవారం ఎక్యూఐ స్థాయిలు 377గా నమోదయ్యాయి. ఢిల్లీలో 30 వాతావరణ పర్యవేక్షణ కేంద్రాల్లో గాలి నాణ్యతలు వెరీపూర్ కేటగిరీలోనే నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు సమీర్ యాప్ తెలిపింది.

More Stories
శబరిమలలో సిపిఎం జోక్యంతోనే స్థానిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ!
ప్రధాని మోదీని `గొప్ప స్నేహితుడు’గా పేర్కొన్న అమెరికా
మావోయిస్టు హింసాత్మక ఘటనలు 89 శాతం తగ్గుముఖం