* రోజువారీ నిరుద్యోగ భృతి..రాష్ర్టాలపైనే భారం
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు, రైతు కూలీలకు ప్రతి సంవత్సరం వేతనంతో కూడిన 100 రోజుల పనిదినాలను కల్పించేందుకు చట్టపరమైన భరోసానిచ్చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని(నరేగా) రద్దు చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక నుంచి దాన్ని ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్-గ్రామీణ్’ (వీబీ-జీ రామ్‌జీ) అని పిలుస్తారు.
యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఈ విప్లవాత్మక పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును ఎత్తేస్తున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సోమవారం పాత చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ వీబీ-జీరామ్‌జీ 2025 బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పనిదినాలను 100 నుంచి 125కి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం కోసం 40 శాతం నిధులు భరించేలా కొత్త చట్టాన్ని తీసుకురానున్నది. బిల్లు ప్రకారం కేంద్రం, రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఖర్చును 60:40 నిష్పత్తిలో పంచుకుంటాయి.
అయితే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీరుతోసహా ఈశాన్య, హిమాలయన్ రాష్ర్టాలు మాత్రం 10 శాతం నిధులు సమకూర్చుకోవలసి ఉంటుంది. మిగిలిన 90 శాతం నిధులను కేంద్రం భరిస్తుంది. అంతేగాక ఈ పథకం అమలును సమీక్షించేందుకు, పర్యవేక్షించేందుకు, పటిష్టంగా అమలు చేసేందుకు కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ కౌన్సిల్, రాష్ట్ర గ్రామీణ ఉపాధి హామీ కౌన్సిళ్లు చట్టం కింద ఏర్పడతాయి. ఇవిగాక కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో స్టీరింగ్ కమిటీలు కూడా ఏర్పడతాయి.
20 ఏళ్ల క్రితం పథకాన్ని తీసుకొచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితి ఇప్పుడు లేదని, మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని చౌహాన్ ప్రకటించారు. గ్రామీణ ప్రజలకు ఆదాయాన్ని ఇచ్చే ఉమ్మడి ఆస్తులను సరిపడా సృష్టించడం, వాటిపై అధికారాన్ని ఇవ్వడం పథకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ క్రమంలో వికసిత భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల సంపదను సృష్టిస్తారని వివరించారు.
వ్యవసాయ పనుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూలీల కొరత తీర్చడం కోసం ఉపాధి హామీకి హాలీడే ప్రకటిస్తారని మంత్రి తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి వ్యవసాయ పనుల రద్దీ సీజన్‌ను గుర్తించి, ఉపాధి పనుల హాలీడే ప్రకటించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ నీటి వనరుల పునరుద్దరణ, కరవు, వరదల సమయంలో ప్రత్యేక పనుల ద్వారా ఉపాధి కల్పించడం లక్ష్యాలలో భాగమని తెలిపారు. వికసిత్ గ్రామ పంచాయత్ ప్రణాళికలో భాగంగా పంచాయతీ పనులకు కూడా ఉపాధి హామీని వాడుకోవచ్చు అని చెప్పారు
కేంద్ర ప్రభుత్వ పథకమే అయినప్పటికీ కొత్త ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లోగా అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధి హామీ చట్టం చేయాలని, ఆ చట్టం నిబంధనలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేయాలని చౌహాన్ చెప్పారు. కొన్ని పరామితుల ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి నిర్దిష్ట మొత్తాన్ని కేటాయిస్తామని, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన పరిమితికి మించి ఖర్చు పెట్టాల్సి వస్తే అదనపు మొత్తాలను రాష్ట్రాలే భరించాల్సి ఉంటుందని వివరించారు.
మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి కూడా ఈ పథకంలో భాగస్వామ్యం కల్పించేందుకు తగిన పనుల్లో వారికి కూడా ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక కూలీ రేట్లను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. కల్పించేందుకు తగిన పనుల్లో వారికి కూడా ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక కూలీ రేట్లను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపల ఉపాధిని కల్పించని పక్షంలో కూలీలకు రోజువారీ నిరుద్యోగ భృతిని చెల్లించాలన్న నిబంధనను ఈ బిల్లులో ప్రభుత్వం పునరుద్ధరించింది.
నిరుద్యోగ భృతి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. మాస్టర్ రోల్‌లో పనిచేసే కూలీలకు మస్టర్ ముగిసిన 15 రోజుల్లో వేతనాలు చెల్లించని పక్షంలో 16వ రోజు నుంచి చెల్లించని వేతనాలపై ప్రతిరోజూ 0.05 శాతం నష్టపరిహారంతో వేతనాలను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉంటుంది.
వికసిత్ భారత్@2047కు చెందిన జాతీయ దార్శనికతతో ముడిపడిన గ్రామీణాభివృద్ధి విధానాన్ని నెలకొల్పే లక్ష్యంతో రూపొందించిన ఈ బిల్లు ప్రతులను ప్రభుత్వం సోమవారం లోక్‌సభ సభ్యులకు పంపిణీ చేసింది. నరేగాను 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ తర్వాత 2009 అక్టోబర్ 2 నుంచి మహాత్మా గాంధీ నరేగాగా దీని పేరు మారింది.
కాగా, ఆ సందర్భంగానే మహాత్మాగాంధీ పేరును పథకానికి చేర్చారు. తాజాగా మహాత్మాగాంధీ పేరును తీసేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. బాపూ పేరుతో బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏమిటని గ్రామీణాభివృద్ధి శాఖ స్థాయీ సంఘం చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉల్కా ప్రశ్నించారు. మహాత్మాగాంధీ పేరును ఎత్తేయడం వల్ల ఢిల్లీ నుంచి గల్లీ దాకా అనేకచోట్ల గాంధీ పేరును తొలగించాల్సి ఉంటుందని, స్టేషనరీ ఖర్చు దండగని ప్రియాంకగాంధీ వ్యాఖ్యానించారు.
దేశ చరిత్రలోనే అతి గొప్ప నాయకుడి పేరును తొలగించినపుడు ప్రభుత్వం వివరణ ఇస్తే బాగుంటుందని ఆమె చెప్పారు. పథకం ప్రధాన ఉద్దేశాన్ని సర్వనాశనం చేశారని, దానిపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే గాంధీ పేరును తొలగించారని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు.

More Stories
హైదరాబాద్ నుండే ఆస్ట్రేలియా వెళ్లిన ఉగ్రవాది సాజిద్!
స్థానిక ఎన్నికల ఓటమితో కేరళలో సిపిఎం హింసాకాండ!
జస్టిస్ యశ్వంత్ వర్మకు ఆరు వరాల గడువు